పరిగి, సెప్టెంబర్ 13: ఇండస్ట్రియల్ పార్కుకు తమ భూముల విషయంలో అసెంబ్లీలో ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అబద్ధాలు చెప్పారని శనివారం మధ్యాహ్నం నుంచి ఆందోళనకు దిగిన పరిగి మండలం కాళ్లాపూర్ రైతులను అర్ధరాత్రి దాటాక పోలీసులు అరెస్టు చేశారు. భూములు తీసుకోబోమని హామీ ఇచ్చి మాట తప్పారంటూ ఎమ్మెల్యేపై ఆగ్రహంతో కాళ్లాపూర్ రైతులు నిరసనకు దిగారు. జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రాత్రిపూట అక్కడే పడుకున్నారు. రాత్రి 1.30గంటల ప్రాంతంలో పరిగి, వికారాబాద్ డీఎస్పీలు శ్రీనివాస్, అంజయ్య నేతృత్వంలో పోలీసులు రైతులను అదుపులోకి తీసుకున్నారు. మహిళలు, వృద్దులను కాళ్లాపూర్ గ్రామానికి తరలించారు.
సర్పంచ్ పులిందర్, మాజీ సర్పంచ్ జంగయ్య, మరో 15 మంది రైతులను అరెస్టు చేసి వికారాబాద్ డీటీసీకి తరలించారు. అక్కడే ఒక హాల్లో ఉంచారు. ఉదయం వరకు కనీసం తాగునీరు కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారని రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ తర్వాత అల్పాహారం అనంతరం రైతులను కాళ్లాపూర్ తరలించే ప్రయత్నం చేయగా జాఫర్‌పల్లి గ్రామం దాటాక మిషన్ భగీరథ ప్లాంటు వద్ద బస్సులో నుంచి కిందికి దిగారు. ఎమ్మెల్యే వచ్చి భూములు తీసుకోబోమని హామీ ఇచ్చే వరకు గ్రామానికి వెళ్లబోమని రైతులు స్పష్టంచేశారు. దీంతో డీఎస్పీ శ్రీనివాస్ ఎమ్మెల్యేతో ఫోన్లో మాట్లాడించారు. వినాయక చవితి తర్వాత మాట్లాడుదామని అప్పటివరకు ఆందోళన విరమించాలని ఎమ్మెల్యే కోరడంతో వారు కాళ్లాపూర్‌కు వెళ్లేందుకు అంగీకరించారు.

కాళ్లాపూర్ రైతులను కలిసేందుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, బీఆర్ఎస్ శ్రేణులను జాఫర్‌పల్లి స్టేజీ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. రైతులను కలిసేందుకు వెళ్తున్నానని, ఎందుకు అడ్డుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి సీఐ కొండల్‌రెడ్డిని ప్రశ్నించారు. అయినా కాళ్లాపూర్‌కు వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యేతో పాటు బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేశారు. కులకచర్ల పోలీస్‌స్టేషన్‌కు మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డిని తీసుకెళ్లినట్టు తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అనంతరం సొంత పూచీకత్తుపై మాజీ ఎమ్మెల్యేతో పాటు బీఆర్ఎస్ శ్రేణులను వదిలిపెట్టారు.
పరిగిలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి విమర్శించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే అబద్ధాలు చెప్పడంతోనే కాళ్లాపూర్ రైతులు ఆందోళనకు దిగారని, వారిని అరెస్ట్ చేయడమేందని ప్రశ్నించారు. రైతులకు సంఘీభావంగా వెళ్తున్న తనను కూడా పోలీసులు అడ్డుకోవడమేందని నిలదీశారు. అభివృద్దికి తామెప్పుడూ వ్యతిరేకం కాదని, భూ సేకరణ చేసినప్పుడు రైతులు కోరుకున్న విధంగా పరిహారంతోపాటు వారిని ఒప్పిస్తే బాగుండేదని పేర్కొన్నారు. పట్టా పంట భూములను తీసుకోవడం సరికాదని, ప్రభుత్వం వెంటనే భూ సేకరణ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతుల తరఫున బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని హెచ్చరించారు.