సిద్దిపేట, మార్చి 9: ప్రజాసేవే ప్రథమ లక్ష్యమని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. 35 ఏండ్ల క్రితమే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట నియోజకవర్గంలోని చింతమడకలో ఇఫ్తార్ విందు ప్రారంభించారని గుర్తుచేశారు. రంజాన్ సందర్భంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎక్బాల్ మినార్ ఈద్గా మైదానంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్‌అలీ, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్హుస్సేన్, మసటి అధినేత మసటి అలీతో కలిసి ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ సిద్దిపేటలో ప్రారంభమైన ఇఫ్తార్ విందులు నేడు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ పాలన కొనసాగించారని గుర్తు చేశారు. రాష్ట్రంలోనే హైదరాబాద్ తర్వాత మొట్టమొదటి హజ్‌హౌస్ నిర్మాణం సిద్దిపేటలోనే జరిగిందన్నారు. సిద్దిపేట అభివృద్ధిలో రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. గతంలో రంజాన్ పండుగ వచ్చిందంటే సదుపాయాల కోసం వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించేదని అదే కేసీఆర్ సీఎం అయ్యాక సమావేశాలు నిర్వహించక ముందే పూర్తిస్థాయి సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఆఖరి సఫర్ అనే అంతిమయాత్ర వాహనాన్ని సిద్దిపేటలోనే ప్రారంభించుకున్నామన్నారు.
ప్రతి సంవత్సరం సొంత డబ్బులతో పదిమంది నిరుపేద ముస్లింలను ఉమ్రయాత్రకు పంపిస్తున్నట్లు గుర్తుచేశారు. విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని, ముస్లిం మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేకంగా గురుకులాలు ఏర్పాటు చేసిందన్నారు. నమాజుతో పాటు ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన అందించిందన్నారు. నిరుపేదలు సైతం సంతోషంగా పండుగను జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా రంజాన్‌తోఫా అందించామన్నారు. మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మసటి అధినేత మసటి అలీ మాట్లాడుతూ సిద్దిపేటను అన్ని రంగాల్లో హరీశ్‌రావు అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలిపారన్నారు. ఇకడి ప్రజలు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటారన్నారు.