ఇయాళ రాష్ట్రంలోని ప్రజలంతా కేసీఆర్ పాలనను కోరుకుంటున్నరు. కేసీఆర్ ఎప్పుడు వస్తారని, ఎప్పుడు ముఖ్యమంత్రి అయితాడని, మనకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నరు. ఇది ప్రతి మనిషి, రైతు గుండెల్లో ఉన్నమాట! ఇయాళ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి మళ్లీ కేసీఆర్ రావాలే అనే మాట అర్థమైంది. ఇలా అర్థమైన ప్రతి ఒక్కరూ మాతో కలిసి రావాలి. ఈ దుర్మార్గ, అప్రజాస్వామిక ప్రభుత్వాన్ని నిలదీద్దాం. కలిసికట్టుగా కొట్లాడుదాం. రాబోయే ఏడాది, ఏడాదిన్నర కాలంలో ప్రభుత్వానికి ఊపిరి సలపకుండా చేద్దాం. అందుకు కార్యాచరణ రూపొందిద్దాం. కాంగ్రెస్ సర్కారు మెడలు వంచే దిశగా ముందుకుపోదాం.
కేసీఆర్ ఆడబిడ్డ పెండ్లికి లక్ష రూపాయలు ఇస్తే దాని మీదికెళ్లి తులం బంగారం ఇస్తానని రేవంత్ హామీ ఇచ్చాడని గుర్తు చేశారు. తాము ఆ రోజే చెప్పామని, వీళ్లు బంగారం ఇచ్చేటోళ్లు కాదని, మెడలోని పుస్తెలతాడు ఎత్తుకపోయే దొంగలని నమ్మవద్దని చెప్పామని అన్నారు. ఇప్పటి వరకు తులం బంగారం కాదు కదా ఇనుము కూడా ఇయ్యలేదన్నారు.
రాజన్న సిరిసిల్ల, మార్చి 9 (నమస్తే తెలంగాణ)/ సిరిసిల్ల టౌన్ : ప్రజల అభిమానాన్ని, నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేయాలని సిరిసిల్ల, వేములవాడలోని బీఆర్ఎస్ కౌన్సిలర్లకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ నిర్దేశం చేశారు. తాను ఒక మంచి పనిచేస్తే.. మీరు రెండు మంచి పనులు చేసి ప్రజల మనసులు గెలుచుకోవాలని, తాను 40 కోట్లు ఇస్తే.. మీరు 80 కోట్లు ఇవ్వాలని సూచించారు. సోమవారం ఆయన సిరిసిల్ల నియోజకవర్గంలో దాదాపు తొమ్మిది గంటల పాటు పర్యటించారు. మధ్యాహ్నం 12కు వచ్చిన ఆయన, తిరిగి రాత్రి 8.30గంటలకు హైదరాబాద్ వెళ్లిపోయారు. మొదట తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలోని గీత కార్మికుడు సాయిలి కిషన్‌గౌడ్ కుటుంబాన్ని పరామర్శించారు. ఆ తర్వాత సిరిసిల్లలోని సుభాష్‌నగర్‌లో కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించి, సిరిసిల్ల తెలంగాణ భవన్‌కు వెళ్లారు.
సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, గంభీరావుపేట మండలాల్లోని పలువురు సర్పంచులతోపాటు కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ తదితర పార్టీల నేతలు బీఆర్ఎస్లో చేరగా, కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ చైర్పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లను ఆత్మీయంగా సత్కరించారు. బీవైనగర్‌లోని షాదీఖానలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల మాట్లాడారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో చేసిన అభివృద్ధి, ఇతర పనులతోనే మరోసారి బీఆర్ఎస్ మంచి మెజార్టీతో గెలిచిందని, సిరిసిల్ల మున్సిపల్ పీఠం దక్కించుకున్నదని చెప్పారు. కేసీఆర్ పాలనలో సిరిసిల్లతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది కమ్యూనిటీ హాల్లు కట్టుకున్నామని, హైదరాబాద్‌లోని మహానగరంలో ఒక్కో కమ్యూనిటీ హాల్‌ను 4 కోట్ల నుంచి 5 కోట్ల నిధులతో నిర్మించుకున్నామని గుర్తు చేశారు. సిరిసిల్లలో కూడా సుభాష్‌నగర్‌లో 25 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తే కాంగ్రెసోళ్లు కొన్ని అడ్డకుంలు, చికాకులు పెట్టారని మండిపడ్డారు.

అయినా వెంటపడి ఈ రోజు ప్రారంభించుకున్నామని చెప్పారు. ఈ భవన ప్రారంభానికి కౌన్సిలర్ దార్నం అరుణ కృషి అభినందనీయమన్నారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో సిరిసిల్ల మున్సిపల్ అభివృద్ధికి 44 కోట్లు మంజూరు చేస్తే, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తన మీద, సిరిసిల్ల మీద కోపంతో అది రద్దు చేసిందని మండిపడ్డారు. ప్రజలన్నీ గమనిస్తున్నారని, వారి ఆలోచన, చైతన్యాన్ని తక్కువ అంచనా వేయవద్దని హితవుపలికారు. మున్సిపల్లోని అన్ని వార్డుల అభివృద్ధికి కృషి చేయడంతో పాటు స్థానిక కౌన్సిలర్ సూచనలు తీసుకోవాలని, వారి మాట చెల్లుబాటు అయ్యేలా సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. సిరిసిల్ల మున్సిపల్లో 39 వార్డులకు 27 వార్డులు గెలుపొందామని, ఇంకో 3, 4 వార్డులు దగ్గర దాకా వచ్చామన్నారు. ప్రజలు మనపై ఎనలేని విశ్వాసం చూపారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేయాలని మున్సిపల్ పాలకవర్గానికి సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట అగయ్య, రాష్ట్ర నాయకుడు చీటి నర్సింగరావు, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావు, జడ్పీ మాజీ చైర్పర్సన్లు తుల ఉమ, న్యాలకొండ అరుణ, మాజీ ఎంపీపీ జనగామ శరత్‌రావు, ఆయా మండలాల అధ్యక్షులు, సర్పంచులు, కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ – చక్రపాణి, వైస్ చైర్మన్ దార్ల సందీప్, విప్ బుర్ర మల్లికార్జున్‌తో పాటు 27 మంది కౌన్సిలర్లను కేటీఆర్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారికి శాలువాలు కప్పి, జ్ఞాపికలు అందజేసి అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో పనిచేసిన బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరినీ అభినందించారు. అదే విధంగా వేములవాడ మున్సిపల్లో గెలుపొందిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు రామతీర్థపు మాధవిరాజు, వాసాల లావణ్య శ్రీనివాస్, వెంగళ అనితశ్రీకాంత్, ఏనుగు జ్యోతితిరుపతిరెడ్డిని వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావుతో కలిసి సన్మానించారు.
రేవంత్‌రెడ్డికి రైతుబంధు ఇచ్చేందుకు పైసలు లేవు. కానీ, రాహుల్‌గాంధీ, గాంధీ కుటుంబానికి వెయ్యి కోట్లు ఇచ్చి సీఎం కుర్చీ కాపాడుకుంటున్నడు. కేసీఆర్ సర్కారు హయాంలో మూడు పంటలకు రైతుబంధు ఇయ్యాలన్న ఆయన, ఇప్పటికి మూడు సార్లు రైతుబంధు ఎగ్గొట్టిండు. మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే 9 వేల కోట్ల రైతు భరోసా వేస్తానని ఫిబ్రవరిలో చెప్పిండు. ఇయాళ ఎలక్షన్ అయి నెల రోజులైనా వేయడం లేదు. పంట పంటకు బోనస్ ఇస్తామని చెప్పి మోసం చేసిన్రు. బోనస్ లేదు. రుణమాఫీ లేదు. ఈ నాయకులకు సిగ్గు కూడా లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు నాట్లేసే డిసెంబర్లోనే రైతు బంధు వచ్చేది. మార్చి వచ్చినా ఇంకా రైతుబంధు పైసలు ఎయ్యలేదు. ఇంకో పదిహేను రోజులైతే కోతల టైం వస్తది. ఇంకెప్పుడు రైతు బంధు పడతదోనని రైతులు చూస్తున్నరు. కాంగ్రెసోళ్ల మాటలు నమ్మితే మోసపోయి గోస పడుడే అయితదని కేసీఆర్ చెప్పినట్టే అయింది.