The Odyssey | ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన సంచలన చిత్రం ‘ది ఒడిస్సీ’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. విడుదలైన అతి తక్కువ సమయంలోనే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 1 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 9500 కోట్లకు పైగా) వసూళ్లను సాధించి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఈ పౌరాణిక యాక్షన్ ఎపిక్ చిత్రంలో మాట్ డ్యామన్, టామ్ హాలండ్, ఆన్ హ్యాథవె వంటి ప్రముఖ నటీనటులు ప్రధాన పాత్రల్లో నటించారు.
కాగా.. క్రిస్టోఫర్ నోలన్ కెరీర్లో బిలియన్ డాలర్ల వసూళ్లు సాధించిన మూడో సినిమాగా ‘ది ఒడిస్సీ’ నిలిచింది. దీనికి ముందు ఆయన దర్శకత్వం వహించిన ‘ది డార్క్ నైట్’ (2008), ‘ది డార్క్ నైట్ రైజెస్’ (2012) సినిమాలు మాత్రమే ఈ ఘనత సాధించాయి. దాదాపు 2012 తర్వాత నోలన్ నుండి ఈ మైలురాయిని అందుకున్న ఏకైక చిత్రం ఇదే కావడం విశేషం. ఈ సినిమా భారీ విజయం సాధించడంలో ఐమ్యాక్స్ మరియు ప్రీమియం ఫార్మాట్ స్క్రీన్లు కీలక పాత్ర పోషించగా, ఐమ్యాక్స్ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాలలో ఒకటిగా ఇది నిలిచింది.