Snake in plane : విమానం (Flight) లో పాము దూరడంతో టేకాఫ్ రెండు గంటలు ఆలస్యమైంది. టేక్ క్యాచర్ వచ్చి ఆ పామును పట్టుకునే వరకు ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆస్ట్రేలియాలో ‘వర్జిన్ ఆస్ట్రేలియా (Virgin Australia)’ ఎయిర్‌లైన్స్‌కు చెందిన VA337 విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం మెల్బోర్న్ (Melbourne) నుంచి బ్రిస్బేన్ (Brisbane) కు బయలుదేరే ముందు ప్రయాణికులు పామును గుర్తించారు.
విషయాన్ని విమానంలోని సబ్బందికి తెలియజేయడంతో వారు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు వెంటనే స్నేక్ క్యాచర్ మార్క్ పెల్లీని పిలిపించారు. ఆయన ఓ అరగంటపాటు శ్రమించి ఆ పామును పట్టుకున్నాడు. లగేజ్ ఏరియాలో దూరిన పామును చాకచక్యంగా బయటకి తీసుకొచ్చాడు. అనంతరం విమానంలో తనిఖీలు నిర్వహించి టేకాఫ్ చేశారు.
అధికారుల నుంచి సమాచారం అందగానే అరగంటలో తాను ఎయిర్‌పోర్టుకు చేరుకున్నానని, సెక్యూరిటీ చెకప్స్ దగ్గర బాగా ఆలస్యం జరిగిందని స్నేక్ క్యాచర్ పెల్లీ తెలిపాడు. పాము లగేజ్‌లో దాక్కుని ఉండటంతో కనిపించలేదని, విషపూరితమైన పాము కావచ్చని సిబ్బందిని కూడా కిందకు దించేశానని, అయితే అది పసిరిక పాము అని ఆయన చెప్పాడు. చెట్లపై ఉండే ఈ ఆకుపచ్చ పాము విషపూరితం కాదని అన్నాడు.