Asim Arun : చాలామంది ఓపికపట్టలేక ట్రాఫిక్ నిబంధనలు (Traffic rules) ఉల్లంఘిస్తారు. ఆపైన చలాన్లు ఎగ్గొట్టడానికి ప్రయత్నిస్తారు. అయితే యూపీ (Uttarpradesh) కి చెందిన ఓ మంత్రి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. తనకు కేటాయించిన ఓ కారు నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో ఆ కారులో వెళ్లేందుకు నిరాకరించారు. అంతేగాక ఆ కారుకు జరిమానా విధించాలని పోలీసులను కోరారు. ఈ మేరకు ఏకంగా వారణాసి పోలీస్ కమిషనర్ (Varanasi police commissioner) కే లేఖ రాశారు.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్‌ప్రదేశ్ (UP) సాంఘిక, సంక్షేమ శాఖ మంత్రి అసిమ్ అరుణ్ (Asim Arun) ఇటీవల వారణాసిలో పర్యటించారు. ప్రొటోకాల్ ప్రకారం ఈ పర్యటన కోసం అధికారులు ఆయన ఇన్నోవా కారును కేటాయించారు. ఆ కారుపై నిబంధనలకు విరుద్ధంగా బుగ్గ లైట్ ఉండటంతో మంత్రి ఆ కారులో వెళ్లేందుకు నిరాకరించారు. విషయాన్ని వారణాసి పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. రూల్స్‌కు వ్యతిరేకంగా ఉన్న ఆ కారుపై జరిమానా విధించాలని కోరుతూ లేఖ రాశారు.
‘రూల్స్ ప్రకారం కారుపై నీలం రంగు బుగ్గ లైట్లు ఉండకూడదు. వాటిపై కోర్టు నిషేధం ఉంది. అయినప్పటికీ చాలామంది తమ పరపతి చూపించుకోవడానికి ఇలాంటి లైట్లు, స్టిక్కర్లు వినియోగిస్తున్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి’ అని మంత్రి తన లేఖలో కోరారు. వారణాసిలో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన ఓ సదస్సులో పాల్గొనడానికి మంత్రి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మంత్రి అరుణ్ మాజీ ఐపీఎస్ అధికారి. ఆయన తండ్రి కూడా గతంలో యూపీ డీజీపీగా బాధ్యతలు నిర్వహించారు.