Mallikarjun Kharge : హిమాచల్‌ప్రదేశ్ (Himachal Pradesh) కు కేంద్రం సవతితల్లి తల్లి ట్రీట్మెంట్ ఇస్తోందని కాంగ్రెస్ పార్టీ (Congress party) జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) విమర్శించారు. ఆ రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధుల మంజూరులో కేంద్రం తాత్సారం చేస్తోందని ఆరోపించారు. భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో 2023లో హిమాచల్‌ప్రదేశ్‌కు భారీ నష్టం వాటిల్లిందని, దాంతో రూ.9000 కోట్ల నిధులు మంజూరు చేయాలని అక్కడి ప్రభుత్వం కేంద్రాన్ని కోరిందని ఖర్గే తెలిపారు.
అయితే రెండేళ్లయినా పెండింగ్ నిధులు మంజూరు చేయకుండా కేంద్రం తాత్సారం చేస్తోందని ఖర్గే విమర్శించారు. 2023లో హిమాచల్‌ప్రదేశ్‌లో పరిస్థితులను చక్కదిద్దేందుకు కాంగ్రెస్ పార్టీ రూ.4,500 కోట్లు ఇచ్చిందని, కేంద్రం కేవలం రూ.433 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుందని ఆరోపించారు. 2023 పెండింగ్ నిధుల పేరుతో కేంద్రం ఇప్పుడు రూ.2000 కోట్లు ప్రకటించి క్రెడిట్ మొత్తం తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.
ఇప్పుడు కూడా భారీ వర్షాలు, వరదలతో హిమాచల్‌ప్రదేశ్ అతలాకుతలం అవుతోంది. ఈ వర్షాలు, వరదలవల్ల ఇప్పటివరకు జరిగిన వేర్వేరు ఘటనల్లో అక్కడ 51 మంది మరణించారని, మరో 22 మంది గల్లంతయ్యారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.