Hasin Jahan : కలకత్తా హైకోర్టు (Calcutta high court) తనకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంపై క్రికెటర్ మహ్మద్ షమీ (Mohammad Shami) మొదటి భార్య హసిన్ జహాన్ (Hasin Jahan) హర్షం వ్యక్తంచేశారు. మన దేశంలో న్యాయం, ధర్మం ఇంకా బతికే ఉన్నాయని, అందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని ఆమె అన్నారు. ఎవరి బాధ్యతలు వాళ్లు నిర్వహించాలనే విషయాన్ని కోర్టు తీర్పు స్పష్టంచేసిందని చెప్పారు.
మనం ఎవరితోనైనా సంబంధం పెట్టుకునేటప్పుడు అతను మంచివాడు కాదని, మోసగాడని, నీ భవిష్యత్తుతో ఆడుకుంటాడని అతడు ముఖంపై రాసి ఉండదని, అందుకే చాలామందిలాగే తాను కూడా బాధితురాలిని అయ్యానని హసిన్ జహాన్ అన్నారు. పెళ్లికి ముందు తాను మోడల్‌గా చేసేదాన్నని, కానీ పెళ్లి తర్వాత షమీ బలవంతంగా తనను తన వృత్తి నుంచి మాన్పించాడని ఆమె చెప్పారు. తనను వంటింటికే పరిమితం చేశాడని తెలిపారు.
తాను షమీని ఎంతగానో ప్రేమించానని, ఈ విషయాన్ని తాను సంతోషంగా ఒప్పుకుంటానని హసిన్ జహాన్ చెప్పారు. కానీ అతను తనను, తన కుమార్తెను వదిలేశాడని, ఇప్పుడు నాకు నేను సొంతంగా సంపాదించుకునే పరిస్థితి లేదని, అందుకే తాము కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు. మహమ్మద్ షమీ తనను నాశనం చేయలేదని, ఎందుకంటే తాను న్యాయ మార్గంలో ఉంటే అతను అన్యాయ మార్గంలో ఉన్నాడని అన్నారు.
కాగా షమీపై హిసిన్ కలకత్తా హైకోర్టులో మెయింటెనెన్స్ కేసు వేశారు. దాంతో కలకత్తా హైకోర్టు.. హిసిన్కు, ఆమె కుమార్తెకు మెయింటెనెన్స్ కోసం నెలకు రూ.4 లక్షలు చెల్లించాలని షమీని ఆదేశిస్తూ ఇవాళ తీర్పు చెప్పింది.