(స్పెషల్ టాస్క్ బ్యూరో) న్యూఢిల్లీ/హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ) : పశ్చిమాసియాలో నాలుగో రోజూ ఉద్రిక్తతలు కొనసాగాయి. దాడులు, ప్రతి దాడులతో అటు ఇరాన్, ఇటు ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాల్లో పరిస్థితులు మరింత దిగజారాయి. యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకొన్నది. ప్రపంచ చమురు రవాణాకు జీవనాడిగా పిలిచే హొర్ముజ్ జల సంధిని మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ జలసంధి గుండా నౌకలు వస్తే నిప్పు పెట్టి కాల్చివేస్తామని హెచ్చరించింది. మరోవైపు, తమ సుప్రీం లీడర్ ఖమేనీ హత్యకు ప్రతీకారంగా ఇరాన్ మంగళవారం కూడా దాడులను ముమ్మరం చేసింది. సౌదీలోని అమెరికా ఎంబసీపై, బహ్రెయిన్‌లోని అమెరికా ఎయిర్‌బేస్‌పై, కువైట్‌లోని అమెరికా స్థావరంపై డ్రోన్ దాడులతో విరుచుకుపడింది. దీనికి బదులుగా ఇరాన్ అధ్యక్ష భవనంతోపాటు సెక్యూరిటీ కౌన్సిల్ భవనాలపై ఇజ్రాయెల్ దాడులను తీవ్రతరం చేసింది. రానున్న 24 గంటల్లో ఇరాన్‌పై భీకర దాడులు చేయనున్నట్టు అమెరికా హెచ్చరించింది. చర్చలకు సిద్ధమని ఇప్పుడు ఇరాన్ ముందుకు వచ్చిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. అయితే ఇప్పటికే ఆలస్యమైందని తాను బదులిచ్చినట్టు చెప్పారు. కాగా యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా ఇరాన్లో 787 మంది మరణించినట్టు సమాచారం. 24 గంటల కిందట ఇరాన్ రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మజీద్ ఇబెన్ అల్-రెజా కూడా ఇజ్రాయెల్ దాడుల్లో మరణించినట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
హొర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్టు ఇరాన్ మంగళవారం ప్రకటించింది. ఈ జలసంధి గుండా నౌకలు వస్తే నిప్పు పెట్టి కాల్చివేస్తామని హెచ్చరించింది. ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో హొర్ముజ్ మార్గంలో ఇతర దేశాలకు చెందిన 706 నౌకలు నిలిచిపోయినట్టు మారిటైమ్ అనలిటిక్ సంస్థలు విండ్వర్డ్, కెప్లెర్ అంచనా వేశాయి. ఇందులో 334 చమురు రవాణా నౌకలే ఉన్నట్టు పేర్కొన్నాయి. ప్రపంచ దేశాలు వాడే చమురులో ఐదోవంతు రవాణా హొర్ముజ్ నుంచే జరుగుతున్నది. ఇప్పుడు ఇరాన్ ప్రకటనతో 85 శాతానికి పైగా చమురు సరఫరాపై ప్రభావం పడినట్టు తెలుస్తున్నది. పరిస్థితి ఇలాగే కొనసాగితే, ఈ మార్గం నుంచి వచ్చే చమురు, ఎల్ఎన్జీని అత్యధికంగా వినియోగించే భారత్‌తో పాటు చైనా, దక్షిణ కొరియా, జపాన్ తదితర దేశాల్లో పెట్రోల్, గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటొచ్చని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా భారత్‌కు సరఫరా అయ్యే 50 శాతం చమురు హొర్ముజ్ జలసంధి గుండానే వస్తుండటం గమనార్హం. దీంతో మన దేశంలో పెట్రోల్, గ్యాస్ ధరలు పెరగవచ్చునని ప్రచారం జరుగుతున్నది.

ఖమేనీ మృతికి ప్రతీకారంగా సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడింది. దీంతో ఆ ప్రాంతంలో మంటలు చెలరేగి, పెద్దయెత్తున పొగ వ్యాపించింది. మరోవైపు, బహ్రెయిన్‌లోని షేక్ ఇసా ప్రాంతంలో ఉన్న అమెరికా ఎయిర్‌బేస్‌ను కూడా డ్రోన్లు, క్షిపణులతో ధ్వంసం చేసినట్టు ఇరాన్ ప్రకటించింది. ఇంకోవైపు, యూఏఈలోని ఫుజైరా ఆయిల్ ఫీల్డ్‌పై ఇరాన్ డ్రోన్ దాడులు జరిపింది. కాగా.. ఇరాన్ దాడుల్లో యూఏఈలోని పలు భవనాలు ధ్వంసమయ్యాయి. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. ఇరాన్ భీకర దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో హైఅలర్ట్ ప్రకటించారు. ఇజ్రాయెల్‌లో ఉన్న తమ పౌరులను ఉద్దేశించి జెరూసలేంలోని అమెరికా రాయబార కార్యాలయం కీలక విజ్ఞప్తి చేసింది. తదుపరి నోటీసులు వచ్చేవరకూ పౌరులందరూ ఎక్కడివారు అక్కడే ఉండాలని, అమెరికన్లను తరలించే లేదా సాయం చేసే పరిస్థితిలో ఎంబసీ లేదని పేర్కొంది. యూఏఈలోని తమ రెండు డేటా సెంటర్లపై డ్రోన్ దాడులు జరిగాయని అమెజాన్ ధ్రువీకరించింది. బహ్రెయిన్‌లోని ఓ డేటా సెంటర్ సమీపంలో దాడి జరిగిందని, దీంతో పాక్షికంగా నష్టం జరిగినట్టు వెల్లడించింది.
ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా తన దాడులను తీవ్రం చేసింది. ఇరాన్ అధ్యక్ష కార్యాలయంతో పాటు సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ భవనంపై కూడా బాంబులు విడిచామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. 24 గంటల కిందట ఇరాన్ రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మజీద్ ఇబెన్ అల్-రెజా కూడా ఇజ్రాయెల్ దాడుల్లో మరణించినట్టు అక్కడి మీడియా వెల్లడించింది. ఇరాన్‌లోని నతాంజ అణు కేంద్రంపై అమెరికా-ఇజ్రాయెల్ సేనల దాడి నిజమేనని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) వెల్లడించింది. టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో భారతీయ విద్యార్థుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అక్కడి స్థానిక రాయబార కార్యాలయం పలువురు విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఎంబసీ సాయాన్ని నిరాకరించిన వారు ఇండ్లలోంచి బయటకు రాకుండా ఉండాలని సూచించింది. ఇదిలా ఉండగా.. ఒకవైపు యుద్ధం కొనసాగుతున్న క్రమంలో ఇరాన్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కూల్‌పై భూకంప తీవ్రత 4.3గా నమోదైంది. దక్షిణ ఇరాన్‌లోని గెరాష్ ప్రాంతంలో ఈ ప్రకంపనలు వచ్చాయి. ఆస్తి, ప్రాణనష్టం వివరాలు తెలియాల్సి ఉంది. ఇరాన్‌పై శనివారం జరిగిన తొలి దాడి కోసం అమెరికా రూ.7 వేల కోట్లను ఖర్చు చేసినట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. యుద్ధంలో ఆర్థిక భారం పెరుగకుండా ఉండేందుకు అటు ఇరా న్ కూడా చర్యలకు దిగింది. చవకైన డ్రోన్లను ప్రయోగిస్తూ.. ప్రతిదాడులను ఎక్కువకాలం పొడిగించే వ్యూహాలకు పదును పెట్టింది.

ఇరాన్‌పై ఇప్పటివరకూ అమెరికా-ఇజ్రాయెల్ చేసిన సంయుక్త దాడుల్లో 787 మంది మరణించినట్టు ఇరానియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇజ్రాయెల్-అమెరికా దాడుల్లో వందలాది మంది పౌరులు మరణిస్తుండటంపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి రోజు చేసిన దాడుల్లో మినాబ్ నగరంలోని ఓ బాలికల పాఠశాల పూర్తిగా ధ్వంసమై 160 మందికి పైగా విద్యార్థులు చనిపోయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. విద్యార్థినుల కోసం సామూహిక సమాధులు తవ్వుతున్నామని.. ఈ ఘటనతో ఇరాన్‌లోని స్కూల్ ప్రాంగణాలు, ఇతర ప్రాంతాలు ఒక రకంగా శ్మశానాలను తలపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. పశ్చిమాసియాలో ఘర్షణల కారణంగా ఇప్పటివరకూ భారత్‌కు చెందిన ముగ్గురు నావికులు మరణించినట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ వెల్లడించింది.
ఇరాన్‌తో ఘర్షణల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. చర్చలకు సిద్ధమని ఇరాన్ ఇప్పుడు అంటోందని, అయితే, ఇప్పటికే ఆలస్యమైందని తాను బదులిచ్చానని తెలిపారు. తమ దగ్గర లెక్కలేనన్ని ఆయుధాలు ఉన్నాయని ఆయన అన్నారు. అమెరికా కోసం ఉన్నతశ్రేణి ఆయుధాలను ఇతర దేశాల్లోనూ నిల్వ చేసినట్టు పేర్కొన్నారు. ఇరాన్‌పై తాము ఇప్పటివరకూ పెద్ద దాడులే చేయలేదని వ్యాఖ్యానించారు. రానున్న 24 గంటల్లో ఇరాన్‌పై భీకర దాడులు చేయనున్నట్టు అమెరికా అధికారులు ప్రకటించారు.