న్యూఢిల్లీ, జూలై22 : కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ఎన్సీపీ (శరద్‌పవార్) వర్గం మద్దతు ఇవ్వనుందంటూ గతకొన్ని రోజులుగా ప్రచారం జోరుగా సాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. బుధవారం ఢిల్లీలో ప్రధాని మోదీతో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, ఆయన కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగిన ఈ సమావేశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తనను కలుసుకోవడానికి వచ్చిన శరద్ పవార్‌ను ప్రధాని మోదీ స్వయంగా గుమ్మం వద్దకు వెళ్లి లోపలికి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఇరువురి మధ్య పలు అంశాలు చర్చకు వచ్చినట్టు తెలిసింది. దేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, సాగునీటి అంశాలపై ప్రధానికి శరద్ పవార్ మెమోరాండం సమర్పించారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారంపై ప్రతిపక్షాలు కేంద్రాన్ని నిలదీస్తున్నవేళ ప్రధానితో శరద్ పవార్ భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లుకు అవసరమైన రెండొంతుల మెజార్టీ సాధించేందుకు కేంద్రం వివిధ పార్టీల మద్దతు కూడగడుతున్నది.