Heavy rians : ఉత్తరాది రాష్ట్రం రాజస్థాన్ (Rajasthan) ను కుండపోత వర్షాలు (Heavy rains) ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కోటా (Kota) సహా పలు జిల్లాల్లో ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కోటా, పాలి, జాలోర్ ధోల్పూర్ జిల్లాలో ఈ వర్షాలు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలవల్ల చోటుచేసుకున్న వేర్వేరు ఘటనల్లో మొత్తం 12 మంది ప్రాణాలు కోల్పోయారు.
లోతట్టు ప్రాంతాల్లో ట్రాక్‌లపై వరదనీరు నిలవడంవల్ల రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. జోధ్‌పూర్ జిల్లాలో కరెంట్ షాక్ తగిలి వేర్వేరు ఘటనల్లో ఒక రైతు, ఒక ఎలక్ట్రిసిటీ లైన్మాన్ ప్రాణాలు కోల్పోయారు. పాలీ జిల్లాలో భారీ వర్షాలవల్ల నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దాంతో మంగళవారం జిల్లాలోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
జాలోర్, జోధ్‌పూర్ జిల్లాల్లో ట్రాక్‌లపై వరదనీరు నిలువడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు రైళ్ల వేళల్లో మార్పులు చేశారు. కోటా జిల్లాలో చంబల్ రివర్ ఉప్పొంగి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. చంబల్ నదిలో చేపల వేటకు వెళ్లిన ఏడుగురు జాలర్లు ప్రవాహంలో కొట్టుకుపోయారు.
రాన్‌పూర్‌లో స్కూటీపై వెళ్తున్న ఓ విద్యార్థిని రోడ్డుపైకి వచ్చిన వరదలో జారిపడి కొంతదూరం కొట్టుకుపోయింది. ఎస్డీఆర్ఎఫ్ బలగాలు ఆమెను బయటికి తీసుకొచ్చినప్పటికీ ప్రాణాలు కాపాడలేకపోయారు. ధోల్పూర్ జిల్లాలోని నారిపుర, సంత్‌నగర్ ఏరియాల్లో వరద ప్రవాహానికి రోడ్లు తెగిపోయాయి. ఇద్దరు బైకర్లు ప్రవాహంలో కొట్టుకుపోయారు.