అందివస్తున్న ఆధునిక సాంకేతికత.. అతివల పాలిట శాపంగా మారుతున్నది. ముఖ్యంగా.. ‘డీప్‌ఫేక్ టెక్నాలజీ’ మహిళల్నే లక్ష్యంగా చేసుకుంటున్నది. సామాజిక మాధ్యమాల్లోని డీప్‌ఫేక్ వీడియోల్లో.. దాదాపు 93% బాధితులు ఆడవాళ్లే కావడం.. ఆందోళన కలిగిస్తున్నది. అదే సమయంలో ఇలాంటి కంటెంట్ పరిమాణం కూడా దాదాపు 900% పెరిగింది. తాజాగా, ‘పై-ల్యాబ్స్’ సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం బయటపడింది.
కృత్రిమ మేధస్సును అధికశాతం మంది దుర్వినియోగమే చేస్తున్నారట. వారిలో చాలావరకు మహిళల్ని టార్గెట్ చేస్తూ.. అభ్యంతరకర చిత్రాలు రూపొందిస్తున్నారు. గుర్తింపును తారుమారు చేయడం, అసభ్య వీడియోలు సృష్టించడం లాంటివీ పెరుగుతున్నాయి. ఆయా ఫొటోలు, వీడియోలతో.. మహిళల్ని డిజిటల్ వేధింపులకూ గురిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సర్క్యులేట్ అవుతున్న డీప్‌ఫేక్ పోర్నోగ్రఫీలో.. దాదాపు 98% మహిళలను లక్ష్యంగా చేసుకుని రూపొందిస్తున్నవే! ఇవన్నీ సులభంగా యాక్సెస్ చేయగల ఫేస్ స్వాపింగ్ అప్లికేషన్లను ఉపయోగించి సృష్టిస్తున్నారు. ప్రస్తుతం ఆన్లైన్లో 5,000 కంటే ఎక్కువ ఫేస్ స్వాప్ అప్లికేషన్లు, 1,000కి మించిన వాయిస్-క్లోనింగ్ టూల్స్ అందుబాటులో ఉన్నాయి. దాంతో, మానిప్యులేటెడ్ మీడియాను సృష్టించడానికి, సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేయడానికి ఫ్రాడ్స్టర్లకు అవకాశం దొరుకుతున్నది. అదే సమయంలో మహిళలకు సంబంధించిన సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయి.
2024లో దాదాపు 50,000 కేసులు నమోదవ్వగా.. 2026 నాటికి 80,000కు చేరుకున్నాయి. అంటే, కేవలం రెండేళ్లలో దాదాపు 60% పెరుగుదల కనిపిస్తున్నది. ఇక డీప్‌ఫేక్ వీడియోలపై ఫిర్యాదులు వస్తున్న నగరాల్లో బెంగళూరు ప్రథమ స్థానంలో నిలిచింది. దాదాపు 30% ఫిర్యాదులు ఇక్కడి నుంచే వస్తున్నాయి. ఆ తర్వాతి స్థానం హైదరాబాద్ (14 శాతం) కాగా, 13శాతం ఫిర్యాదులతో ముంబై మూడో స్థానంలో నిలిచింది. చెన్నై, కోల్‌కతాలో దాదాపు 5శాతం, ఢిల్లీలో 3శాతం ఫిర్యాదులు వస్తున్నట్లు సర్వే వెల్లడించింది.
కేసులు పెరుగుతున్నప్పటికీ.. ఫిర్యాదులు చేయడానికి మహిళలు వెనకడుగు వేస్తున్నట్లు సర్వేలో బయటపడ్డది. మహిళలతో సంబంధం ఉన్న డీప్‌ఫేక్ దుర్వినియోగ కేసుల్లో 62శాతం ఫిర్యాదులకు దూరంగా ఉన్నవేనట. పరువు పోతుందనీ, లేనిపోని కళంకం అంటుకుంటుందని.. చాలామంది ఫిర్యాదులకు దూరంగా ఉంటున్నారట. ఇక ఆన్లైన్ వేధింపుల చట్టాల గురించి చాలామందికి అవగాహన ఉండటం లేదు. దాదాపు 33% మంది మహిళలకు.. ఈ రకమైన చట్టాల గురించి తెలియదట. ఈ క్రమంలో సైబర్ క్రైమ్ చట్టాలు, డీప్‌ఫేక్ మీడియాపై మహిళలకు అవగాహన కల్పించాలని సర్వే ప్రతినిధులు సూచిస్తున్నారు.