ఆదిలాబాద్ (నమస్తే తెలంగాణ)/నిర్మల్ చైన్‌గేట్, ఆగస్టు 3 : ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం మీటింగ్ హాల్లో కలెక్టర్ రాజర్షి షా అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 109 దరఖాస్తులు వచ్చాయి. అదేవిధంగా నిర్మల్ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ భవేశ్‌మిశ్రా అర్జీలు తీసుకున్నారు. ఇందిరమ్మ ఇండ్లు, ఉపాధి హామీ పథకం, పింఛన్లు, భూ భారతి, ఇతర సమస్యలపై దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుదారులు సమస్యలు పరిష్కరించాలని విన్నవించుకున్నారు. ఇందులో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
శిఖం భూమి సర్వే చేయించాలి..
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని పిప్రి గ్రామానికి చెంది న రైతులు శిఖం భూమి సర్వే చేయించాలని కలెక్టర్ భవేశ్ మి శ్రాకు వినతిపత్రం సమర్పించారు. ఎస్సారెస్పీ ముంపునకు గు రైన చెరువు మరమ్మతు పనులు చేపట్టడం ద్వారా తమ పట్టా భూములు మునిగిపోతున్నాయని పేర్కొన్నారు. ఇటీవల కురి సిన వర్షాలకు నీరు చేరి పంటలు మునిగాయని పేర్కొన్నారు. గతంలో వినతిపత్రం సమర్పించినట్లు రైతులు పేర్కొన్నారు. నిర్మల్ కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.
భూ భారతి ఆపరేటర్లను రెన్యూవల్ చేయాలి..
రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న భూ భారతి ఆపరేటర్ల ఉద్యోగాలను రెన్యూవల్ చేయాలంటూ ఆపరేటర్లు ప్రజావాణిలో కలెక్టర్ రాజర్షి షాకు వినతిపత్రం అందించారు. 2018 నుంచి తాము ధరణి ఆపరేటర్లుగా ఉద్యోగాల్లో చేరామని, ప్రస్తుత ప్రభుత్వంలో భూ భారతి ఆపరేటర్లుగా పనిచేస్తూ రైతులకు సేవలు అందిస్తున్నామన్నారు. తొమ్మిదేండ్లుగా తాము పనిచేస్తున్నామని, ప్రభుత్వం తమను విధుల నుంచి తొలగించే చర్యలు చేపట్టిందన్నారు. ఈ నెల 8 నుంచి విధులకు రావద్దని ఆదేశాలు జారీ చేసేందుకు సిద్ధమైందని ఆపరేటర్లు తెలిపారు. 15 నెలలుగా తమకు వేతనాలు రాకపోయినా అప్పులు చేస్తూ కుటుంబాలను పోషిస్తున్నామన్నారు. తమ ఉద్యోగాలను రెన్యూవల్ చేసి తమకు రావాల్సిన పెండింగ్ వేతనాలు విడుదలు చేయాలని కోరారు.
విచారణ జరిపించాలి
నిర్మల్ జిల్లా మామడ మండలంలోని పొన్కల్‌లో వేరే కులానికి చెందిన కొందరు మున్నూరు కాపు కుల ధ్రువీకరణ పత్రాలు పొందారని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ కలెక్టర్ భవేశ్ మిశ్రాకు వినతిపత్రం సమర్పించారు. ధ్రువీకరణ పత్రాల పంపిణీపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని మున్నూరు కాపు సంఘం నాయకులు కలెక్టర్‌ను కోరారు.
నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలి
గతేడాది ఆగస్టులో కురిసిన వర్షాలతోపాటు ఇటీవల కురిసి న వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించాలని అఖిల పక్ష రైతు సంఘం నాయకులు కలెక్టర్ రాజర్షి షాను కలిసి వినతిపత్రం ఇచ్చారు. గతేడాది వర్షాలతో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 20,800 ఎకరాల్లో పంటలను నష్టపోయారని, ఎకరాకు రూ.10 వేలు ఇస్తామని మంత్రులు హామీ ఇచ్చినా ఇప్పటి వరకు పరిహారం అందలేదని తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలతో సైతం రైతులు పంటలు నష్టపోయారని, అధికారులు సర్వే చేసి వివరాలు సేకరించాలని, నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా చూడాలని అఖిలపక్షం రైతు సంఘం నాయకులు కోరారు.
జొన్నలు అమ్మిన డబ్బులు ఇప్పించాలి..
ప్రభుత్వ మార్క్‌ఫెడ్ కేంద్రాల్లో జొన్నలు విక్రయించి రెండు నెలలు గడుస్తున్నా.. డబ్బులు రాలేదని, జొన్నల పైసలు అందేలా చూడాలంటూ ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని ఖోడద్ రైతులు ప్రజావాణిలో కలెక్టర్ రాజర్షి షాను కలిసి వినతిపత్రం అందించారు. గ్రామంలో దాదాపు 400 మంది రైతులకు రూ.2 కోట్లు రావాల్సి ఉందన్నారు. ఈ డబ్బులు రాకపోవడంతో వానకాలం పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సి వస్తున్నదని తెలిపారు. డబ్బులు ఎప్పుడు వస్తాయని మార్క్‌ఫెడ్ అధికారులను అడిగితే సరిగా స్పందించడం లేదన్నారు. వానకాలం సాగుకు ఉపయోగపడేలా డబ్బులు ఇప్పించాలని రైతులు కోరారు.