Kalyanalakshmi | ఇల్లెందు, అక్టోబర్ 3: తెలంగాణ రాష్ట్రంలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి పథకం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇల్లందు పట్టణంలోని తెలంగాణ తల్లి సెంటర్లో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ వ్యవస్థాపక సభ్యుడు దిండిగాలా రాజేందర్ మాట్లాడుతూ… ఈ పథకం రాష్ట్ర చరిత్రలో ఒక సామాజిక విప్లవం వంటిదని, కేసీఆర్ ఉద్యమ సమయంలో అప్పటి వరంగల్ జిల్లా ములుగు మండలం గుత్తూరు తండాలో నునవత్ ఖీమానాయక్ తన బిడ్డ కవిత పెళ్లికోసం ఏర్పాట్లు చేసుకున్నాడు. దురదృష్ట వశాత్తు అగ్నిప్రమాదంలో పెళ్లికి దాచిన డబ్బు సామాన్లు అన్ని అగ్నికి ఆహుతై ఆ కుటుంబం రోడ్డున పడింది. 2002 మార్చిలో ఆ కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్ ఆ పెళ్ళి ఖర్చులన్నీ భరించి పెళ్లి చేయించాడు. ఆ ప్రేరణతో తెలంగాణా రాష్ట్రం వచ్చాక 2014 అక్టోబర్ 2న కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని ప్రారంభించి, పేద కుటుంబాలకు పెద్దన్నగా, మేనమామగా అండగా నిలబడ్డాడు.
ఆ ఘటనతో కార్యాచరణ రూపం దాల్చిన పథకమే..
కళ్యాణ లక్ష్మీ–షాదీ ముబారక్ అని అధికారంలోకి రాగానే 2014 అక్టోబర్ 2న రూ.51,000 ఆర్థిక సాయంతో పథకం ప్రారంభించిన కేసీఆర్ ,2017లో రూ.75,116కు..2018లో రూ.1,00,116కు పెంచారని, తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో 13,15,297 మంది ఆడబిడ్డలకు రూ.11,560 కోట్లకు పైగా ఆర్థిక సాయం అందించారని, పేదింటి ఆడబిడ్డకు మేనమామలా అండగా నిలిచిన కేసీఆర్.. కళ్యాణ లక్ష్మీ ద్వారా ఒక పథకాన్ని మాత్రమే అమలు చేయలేదని బాల్య వివాహాల నిర్మూలనకు బలమైన పునాది వేశారు. పేద కుటుంబాల్లో ఆడబిడ్డ పెళ్లి భారాన్ని తగ్గించారు. ఒక సామాజిక సంస్కరణకు నాంది పలికారని తెలిపారు.
పార్లమెంట్ చట్టాలు సైతం పరిష్కారం చూపని బాల్య వివాహ సమస్యకు.. ఒక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పథకం పరిష్కార మార్గాన్ని చూపించిందని, ఒక సామాజిక సమస్యకు కేసీఆర్ చూపిన శాశ్వత పరిష్కారమే.. కళ్యాణ లక్ష్మీ. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంతటి మహోన్నత పథకానికి నిర్లక్ష్యం చుట్టుముట్టింది. పెళ్లిళ్లు అయిపోయి.. పిల్లలు పుట్టినా.. కళ్యాణ లక్ష్మీ డబ్బుల కోసం పేద కుటుంబాలు ఎదురుచూస్తున్న పరిస్థితి..ప్రస్తుతం దాపురించిందని BRS ప్రభుత్వ హయాంలో ఏడాదికి రూ. 2500 కోట్లు ఈ పథకం కోసం ఖర్చు చేస్తే, ఇప్పుడు అందులో సగం కూడా ఖర్చు చేయని పరిస్థితి నెలకొందన్నారు.
కేసీఆర్ మీద కక్షతో ఇప్పటికే కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ వంటి పథకాలను నిలిపివేశారు. అదే కోవలో కళ్యాణ లక్ష్మిని నీరుగార్చుతున్నారని ఎన్నికల సమయంలో రూ.లక్ష నగదుతోపాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక గాలికి వదిలేశారని రాజేందర్ మండిపడ్డారు. మూడేళ్లు గడిచినా ఆడబిడ్డలకు ఇచ్చిన హామీని అమలు చేయలేక చేతులెత్తేశారు. తులం బంగారం దేవుడెరుగు, కెసిఆర్ ఇచ్చిన లక్ష ఇస్తే చాలు అన్న పరిస్థితి వచ్చింది. తమిళనాడు సీఎం విజయ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన బంగారం హామీని 4 నెలల్లోనే అమలు చేస్తూ.. ప్రభుత్వ దవాఖానల్లో పుట్టిన ఆడబిడ్డకు బంగారు ఉంగరం అందించే పథకాన్ని ప్రారంభించారు.
పెండింగ్‌లో ఉన్న వెంటనే పరిష్కరించాలి..
తెలంగాణలో మాత్రం మూడేళ్లు గడిచినా తులం బంగారం పరిస్థితి దిక్కుతోచని స్థితిలోనే ఉంది. మాటలు కోటలు దాటితే.. చేతలు గడప దాటవు అనడానికి మరో నిదర్శనం కాంగ్రెస్ ప్రభుత్వం. అన్ని వర్గాలను మోసం చేసినట్టే.. పేదింటి ఆడబిడ్డలను సైతం మోసం చేసిన ఘనుడు రేవంత్ రెడ్డి కళ్యాణ లక్ష్మీ/షాదీ ముబారక్ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలు ఆపాలన్నారు రాజేందర్ .
ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉన్న సుమారు 2 లక్షల దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి. అభయహస్తం మేనిఫెస్టోలో ఆడబిడ్డల పెళ్లికి లక్షతో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీ నిలబెట్టుకోవాలి. కళ్యాణ లక్ష్మీ/షాదీ ముబారక్‌ను రాజకీయ కక్షలకు బలిచేయకుండా.. పేదింటి ఆడబిడ్డకు అండగా నిలిచే పథకంగా కొనసాగించాలి.
రేవంత్ రెడ్డి.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సాక్షిగా మీరు ఇచ్చిన తులం బంగారం హామీని గుర్తు చేస్తున్నా.. నీతి, నిజాయితీ ఉంటే అమలు చేసి, మాట నిలుపుకోవాలని BRS పక్షాన డిమాండ్ చేస్తున్నాం అన్నారు.
ఈ కార్యక్రమంలో tbgks సుదర్శనం రంగనాథ్ మాజీమండల అధ్యక్షులు శీలం రమేష్ ,మాజీ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ జబ్బర్, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ అజ్మీర హౌసింగ్ నాయక్, మాజీ కో ఆప్షన్ నెంబర్ మండల నాయకులు ఘాజి, కాంతారావు, సుభాష్ నగర్ ఉప సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు…