యాదగిరిగుట్ట, మార్చి12 : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారిని రాష్ట్ర నూతన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా గురువారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా గురువారం మధ్యాహ్నం రోడ్డు మార్గం గుండా ఆయన యాదగిరిగుట్టలోని ప్రెసిడెన్షియల్ సూట్ వద్దకు చేరుకున్నారు. అక్కడే గవర్నర్ దంపతులకు ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ ఆక్షాంశ్ యాదవ్, ఈవో భవానీ శంకర్ ఘన స్వాగతం పలికారు. కొద్దిసేపు సేద తీరిన అనంతరం కొండపై ఉన్న వీవీఐపీ అతిథి గృహం వద్దకు చేరుకుని అక్కడి నుంచి లిప్టు గుండా కొండపైకి చేరుకున్నారు. తూర్పు రాజగోపురం వద్దకు చేరుకోగానే ప్రధానార్చక బృందం గవర్నర్ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ లోపలికి ప్రవేశించి ఉత్తర మార్గంలోని మొదటి ప్రాకార మండపంలోని లిప్టు మార్గంలో ముఖ మండపంలోకి వెళ్లారు. ధ్వజ స్థంభానికి మొక్కుతూ గర్భాలయంలోకి ప్రవేశించి స్వయంభూ పంచనారసింహ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
సుమారు 10 నిమిషాల పాటు గవర్నర్ స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ముఖ మండపంలో గవర్నర్ దంపతులకు ఆలయ ప్రధానార్చక బృందం వేదాశీర్వచనం చేశారు. ఆలయ ఈవో భవానీశంకర్ చిత్రపటాన్ని, అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి స్వామివారి మహాప్రసాదం అందజేశారు. అనంతరం తిరిగి లిప్టు మార్గం గుండా మొదటి ప్రాకార మండపానికి చేరుకుని పశ్చిమ రాజగోపురం గుండా మాడవీధుల్లోకి వచ్చారు. బ్యాటరీ వాహనంపై ఉత్తర మాడవీధుల్లో నుంచి బాలాలయం పక్కనే ఉన్న రోడ్డు, బస్టాండ్ నుంచి అనుబంధ దేవాలయం శ్రీపర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వరస్వామివారి ఆలయానికి చేరుకున్నారు. శివాలయ ప్రధానార్చకులు గౌరీభట్ల నరసింహరాములు శర్మ గవర్నర్ దంపతులకు ఘనస్వాగతం పలికారు. స్వయంభూ లింగేశ్వరుడితోపాటు స్ఫటిక లింగేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం వీవీఐపీ అతిథి గృహం వద్దకు చేరుకుని మధ్యాహ్నం భోజనం చేసి, తిరిగి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు.
యాదగిరిగుట్ట ఆలయ నిర్మాణం మహాద్భుతంగా ఉందని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా కితాబునిచ్చారు. దర్శనానంతరం దేవస్థాన ం విజిట్ బుక్కులో ఆయన తన పర్యటన అనుభూతిని వ్యక్త పరిచారు. స్వామివారిని కుటుంబ సభ్యులతో దర్శించుకునే భాగ్యం కలిగిందన్నారు. ఆధ్యాత్మిక మందిరం, ఆలయ నిర్మాణం అద్భుతమని ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణతో పాటు దేశంలోని అన్ని రాష్ర్టాలు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. కార్యక్రమంలో దేవస్థాన ఈవో భవానీ శంకర్, ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, డీఈవో దోర్బల భాస్కర శర్మ, ప్రధానార్చకులు కాండూరి వేంకటాచార్యులు, భట్టర్ సురేంద్రాచార్యులు, ఏఈవోలు నవీన్, రఘు, పర్యవేక్షకులు రాజన్‌బాబు, ఆర్డీవో కృష్ణారెడ్డి, డీఎస్పీ శ్రీనివాస్ నాయుడు, సీఐలు భాస్కర్, శంకర్ గౌడ్, తహసీల్దార్ గణేశ్ నాయక్ పాల్గొన్నారు.