మల్లాపూర్‌కు చెందిన దేవర గోపి, దాదాపు పద్దెనిమిదేండ్ల క్రితం డిగ్రీ పూర్తి చేశాడు. తర్వాత ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. ఆ క్రమంలో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ ఆఫీసుల్లో ఔట్ సోర్సింగ్ పద్ధతిన టైపిస్ట్/కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇవ్వగా, గోపి మల్లాపూర్ రెవెన్యూ ఆఫీస్‌లో టైపిస్ట్/కంప్యూటర్ ఆపరేటర్‌గా చేరాడు. అప్పటి నుంచి అక్కడే విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ పదహారేళ్ల కాలంలో గోపికి వివాహం జరగడంతోపాటు ఇద్దరు పిల్లలు కలిగారు. అలాగే ఆయన తల్లిదండ్రులు సైతం వృద్ధాప్యంలోకి చేరుకున్నారు. దీంతో భార్యాపిల్లలు, తల్లిదండ్రులను పోషించే బాధ్యత గోపిపై పడింది. వచ్చే తక్కువ వేతనంతోనే కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తున్నాడు.
అయితే హఠాత్తుగా సర్కారు వారం పది రోజుల క్రితం ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించాలని జీవో జారీ చేయడం, దాని ఆధారంగా రెవెన్యూ శాఖ టైపిస్ట్/ఆపరేటర్లను తొలగించాలని నిర్ణయించడం శాపంగా మారింది. పదహారేళ్లుగా చేస్తున్న ఉద్యోగం నుంచి హఠాత్తుగా తొలగిస్తామని చెప్పడంతో గోపికి ఏం చేయాలో తోచడం లేదు. కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో తెలియడం లేదు. ఆయనపైన ఆధారపడిన కుటుంబం కూడా తీవ్ర ఆవేదనకు గురవుతున్నది. ఒక్క గోపీ కుటుంబమే కాదు, ఉమ్మడి జిల్లాలోని 76 కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. సర్కారు తమపై కత్తిగట్టవద్దని, దయచూపి ఆదుకోవాలని వేడుకుంటున్నాయి.
జగిత్యాల, మార్చి 12 (నమస్తే తెలంగాణ) : పదహారేళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం రెవెన్యూ కార్యాలయాల్లో టైపిస్ట్/ఆపరేటర్ పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించింది. 2012లో 7,500 వేతనం ఇవ్వగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం కేసీఆర్ సర్కారు వీరి సేవలను గుర్తించి వేతనాలు పెంచింది. 9 వేల నుంచి 15వేలకు చేసింది. 2023లో మరోసారి పెంచి, 22,500 చేసింది. పదహారేళ్ల క్రితం విధుల్లో చేరిన టైపిస్ట్/ కంప్యూటర్ ఆపరేటర్లు రెవెన్యూ ఆఫీసుల్లో అధికారులు ఏ పని అప్పగిస్తే, ఆ పనిచేస్తూ వచ్చారు. ఎన్నికల విధుల నుంచి మొదలుకొని కల్యాణలక్ష్మి, షాదీముబారక్ తదితర అన్ని దరఖాస్తులను ప్రాసెస్ చేస్తున్నారు. అలాగే వ్యవసాయానికి సంబంధించిన రికార్డులు, ఇతర రెవెన్యూ రికార్డులను సైతం వీరే ఆన్లైన్ చేశారు. అలాగే కార్యాలయాల్లో మీసేవా కార్యక్రమాలను సైతం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం జనగణన చేపట్టిన సందర్భంలోనూ కీలక పాత్ర పోషించారు. కేసీఆర్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన (ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ ప్రోగ్రాం)లో రికార్డులన్నింటినీ ఈ టైపిస్ట్/ కంప్యూటర్ ఆపరేటర్లే కంప్యూటరీకరణ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే రెవెన్యూ కార్యాలయాలకు వీరు కీలకంగా మారిపోయారు.
గతేడాది గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షల ద్వారా కొన్ని పోస్టులను సర్కారు కలెక్టరేట్లలో భర్తీ చేసింది. వీఆర్వోలు, వీఆర్ఏలను గతంలో ఇతర శాఖల్లోకి పంపించగా, వారిలో కొందరిని తిరిగి రెవెన్యూ శాఖ పరిధిలోకి తీసుకువచ్చింది. అందులోనూ కొందరిని గ్రామ పంచాయతీ ఆఫీసర్లుగా (జీపీవోలు) నియమించింది. ఈ నేపథ్యంలో రెవెన్యూ కార్యాలయాల్లో ఇక టైపిస్ట్/కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల అవసరం లేదని, వీరి సేవలను మార్చి 31తో ముగిస్తున్నట్టు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ శాఖలోనే కాకుండా రాష్ట్రంలో వివిధ శాఖల పరిధిలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ విధుల నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తున్నది. అయితే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలిగిస్తే ఇబ్బందులు వస్తాయని సంబంధిత శాఖ ఉన్నతాధికారులు భావిస్తే.. ప్రభుత్వానికి నివేదించి కొనసాగించుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొనట్టు తెలిసింది.
జీపీవోల నియామకం జరిగిందని, అలాగే గ్రూప్ 3, 4 పోస్టులను భర్తీ చేశారని, ఈ నేపథ్యంలో టైపిస్ట్/ కంప్యూటర్ ఆపరేటర్ల కొనసాగింపు అవసరం లేదంటూ రెవెన్యూ శాఖ అధికారులు సర్కారుకు నివేదించినట్టు సమాచారం. ఈ మేరకు ప్రభుత్వం కంప్యూటర్ ఆపరేటర్లను మార్చి 31 వరకు కొనసాగించి, ఆపైన కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి వారి ఉద్యోగాలను రెన్యువల్ చేసేదిలేదని స్పష్టం చేసింది. దీంతో ఉమ్మడి జిల్లాలోని 76 మంది, రాష్ట్రంలోని 632 మంది టైపిస్ట్/ కంప్యూటర్ ఆపరేటర్లు ఆందోళన చెందుతున్నారు. పదహారేళ్లుగా కష్టపడి పనిచేస్తున్న తమను రెవెన్యూ శాఖ, ప్రభుత్వం తొలగించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనిపించిన అధికారి చుట్టూ, కలెక్టరేట్ కార్యాలయాల చుట్టూ, ప్రజాప్రతినిధులు, మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తమను కనికరించాలని, తమకు ఉద్యోగ భధ్రత కల్పించాలని వేడుకుంటున్నారు.
పదహారేళ్లుగా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో రెవెన్యూ కార్యాలయాల్లో టైపిస్ట్/కంప్యూటర్ ఆపరేటర్ల వ్యవస్థ కొనసాగుతున్నది. నేను పదకొండేళ్లుగా పనిచేస్తున్నాను. రెవెన్యూ కార్యాలయాల్లో ప్రతి బాధ్యతనూ మాకే అప్పగిస్తున్నారు. మేం అంకితభావంతో పనిచేస్తున్నాం. ఇచ్చే వేతనం అతి తక్కువగా ఉన్నది. అది కూడా పధ్నాలుగు నెలలుగా మాకు వేతనాలు రావడం లేదు. ఎన్నిసార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా ప్రయోజనం లేదు. ఈ రోజు కాకపోయినా.. రేపైనా వస్తాయన్న నమ్మకంతో పనిచేస్తున్నాం. ఇప్పుడు హఠాత్తుగా ప్రభుత్వం మార్చి 31 తర్వాత మీ అవసరం లేదని, ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నామని ఉత్తర్వులు జారీ చేయడం అన్యాయం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే కంటే ముందు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటామని, పనికి తగిన వేతనాన్ని అమలు చేస్తామని చెప్పింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మరిచిపోయింది. పధ్నాలుగు నెలల నుంచి వేతనాలు ఇవ్వడం లేదు. ఇప్పుడు తొలగిస్తామని నిర్ణయం తీసుకున్నది. సర్కారు నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 632 కుటుంబాలు వీధిన పడే పరిస్థితి ఉన్నది. దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా మాపై కనికరం చూపాలి. మాకు గతం కంటే మెరుగైన వేతనాన్ని, సౌకర్యాలను కల్పించాలి.