న్యూఢిల్లీ: రెండు ఆర్థిక సంవత్సరాల్లో రైల్వేకు 61 లక్షలకు పైగా ఫిర్యాదులు అందాయి. రైళ్ల
భద్రత, శుభ్రత, విద్యుత్ వైఫల్యాలపై ప్రయాణికులు ఎక్కువగా ఫిర్యాదు చేశారు. (Passenger Complaints ) మధ్యప్రదేశ్‌లోని నీముచ్‌కు చెందిన చంద్ర శేఖర్ గౌర్ దాఖలు చేసిన ఆర్టీఐ ప్రశ్నకు రైల్వే బోర్డు సమాధానం ఇచ్చింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రైల్వేకు సుమారు 32 లక్షల ఫిర్యాదులు అందినట్లు తెలిపింది. 2023-24లో నమోదైన 28.96 లక్షల కంటే 11 శాతం మేర ఫిర్యాదుల సంఖ్య పెరిగినట్లు పేర్కొంది. రైలు సేవలపై ఫిర్యాదులు 18 శాతం పెరిగినప్పటికీ, రైల్వే స్టేషన్లకు సంబంధించిన ఫిర్యాదులు 21 శాతం మేర తగ్గాయని తెలిపింది. రైల్వే నెట్వర్క్ మిశ్రమ పురోగతిని ఇది ప్రతిబింబిస్తున్నట్లు వెల్లడించింది.
కాగా, ప్రయాణీకుల భద్రత అతిపెద్ద సమస్యగా ఉన్నట్లు రైల్వే తెలిపింది. రైళ్లలో భద్రతకు సంబంధించిన ఫిర్యాదులు 64 శాతం పెరిగినట్లు పేర్కొంది. 2023-24లో 4.57 లక్షల ఫిర్యాదులు అందగా 2024-25లో ఈ సంఖ్య 7.50 లక్షలకు పెరిగిందని వివరించింది. రెండేళ్లలో రైళ్లలో భద్రతకు సంబంధించిన ఫిర్యాదులు 12.07 లక్షలకు చేరుకున్నాయని, నమోదైన ప్రతి నాలుగు ఫిర్యాదులలో భద్రతకు సంబంధించి ఒక ఫిర్యాదు ఉన్నట్లు వెల్లడించింది.
మరోవైపు రెండేళ్లలో విద్యుత్ పరికరాల వైఫల్యాలకు సంబంధించి 8.44 లక్షల ఫిర్యాదులు, కోచ్‌ల శుభ్రతపై 8.44 లక్షల ఫిర్యాదులు అందాయి. నీటి లభ్యత, సిబ్బంది ప్రవర్తన, క్యాటరింగ్ సేవలపై ఫిర్యాదులు కూడా బాగా పెరిగాయి. అయితే రైళ్ల సమయపాలనకు సంబంధించిన ఫిర్యాదులు 15 శాతం మేర తగ్గాయి. 2023-24లో 3.25 లక్షల ఫిర్యాదులు నమోదు కాగా 2024-25లో 2.77 లక్షల ఫిర్యాదులు అందాయి.
కాగా, స్టేషన్ స్థాయి ఫిర్యాదులు 2023-24లో 5.55 లక్షల నుంచి 2024-25లో 4.39 లక్షలకు తగ్గాయి. రిజర్వేషన్ లేని టిక్కెట్ల ఫిర్యాదులు 1.93 లక్షల నుంచి 1.16 లక్షలకు అంటే 40 శాతం మేర తగ్గాయి. టికెట్ వాపసు, లగేజ్-పార్శిల్ నిర్వహణ, సిబ్బంది ప్రవర్తన గురించి ఫిర్యాదులు కూడా తగ్గినట్లు రైల్వే బోర్డు వెల్లడించింది.
మరోవైపు రైల్వే స్టేషన్లలో భద్రత, తాగు నీటి లభ్యత, పరిశుభ్రత, దివ్యాంగులకు సౌకర్యాలు వంటి సమస్యలు ప్రయాణీకులను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. 2024-25లో 20 లక్షలకు పైగా ఫిర్యాదులను రైల్వే హెల్ప్‌లైన్ (139) ద్వారా పరిష్కరించారు. రైల్ మదద్ యాప్ ద్వారా 4.68 లక్షలు, రైల్వే వెబ్సైట్ ద్వారా 4.92 లక్షలు, సోషల్ మీడియా ద్వారా 2.12 లక్షలు ఫిర్యాదులు అందాయి. అయితే లెటర్స్, ఈమెయిల్స్ వంటి సాంప్రదాయ పద్ధతుల ద్వారా అందే ఫిర్యాదులు గణనీయంగా తగ్గినట్లు రైల్వే బోర్డు వెల్లడించింది.
Also Read:
Bodoland People’s Front | టెరిటోరియల్ కౌన్సిల్ ఎన్నికల్లో.. బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ క్లీన్ స్వీప్
Village Headman Kills Man | కొడుకు నామకరణానికి ఆహ్వానించలేదని.. వ్యక్తిని కాల్చి చంపిన గ్రామపెద్ద
Father Kills Daughter | డబ్బులు దొంగిలిస్తున్నదని.. కుమార్తెను హత్య చేసిన తండ్రి