గౌహతి: అస్సాంలో జరిగిన బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ (బీటీసీ) ఎన్నికల్లో హగ్రామా మొహిలరీ నేతృత్వంలోని బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్) క్లీన్ స్వీప్ చేసింది. 40 స్థానాలకు గాను 28 సీట్లు గెలుచుకున్నది. గత కౌన్సిల్లో కూటమి భాగస్వాములైన యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (యూపీపీఎల్) ఏడు, బీజేపీ ఐదు స్థానాల్లో విజయం సాధించాయి. అయితే గతంలో గెలిచిన 12, 9 స్థానాల కంటే ఈసారి తక్కువ సీట్లతో సరిపెట్టుకున్నాయి. గాయకుడు జుబీన్ గార్గ్ మరణం కారణంగా ఎన్నికలకు మూడు రోజుల ముందు ప్రచారాన్ని రద్దు చేయడం బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది.
కాగా, కోక్రాఝర్, చిరాంగ్, బక్సా, ఉదల్గురి, తముల్పూర్ అనే ఐదు జిల్లాలతో కూడిన 40 మంది సభ్యులున్న బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ (బీటీసీ)కు సెప్టెంబర్ 22న ఎన్నికలు జరిగాయి. బీపీఎఫ్ చీఫ్ మొహిలరీ, దేబర్గావ్ నియోజకవర్గం నుంచి గెలిచారు. అయితే యూపీపీఎల్లో చేరిన మాజీ సహచరుడు ఖంపా బోర్గోయరీ చేతిలో చిరాంగ్డ్వార్ స్థానాన్ని కోల్పోయారు. గోయిమారి స్థానంలో బీటీసీ చీఫ్ ప్రమోద్ బోరో గెలిచారు. బీపీఎఫ్‌కు చెందిన ప్రకాష్ బసుమతరి చేతిలో డోట్మాలో ఓడిపోయారు. బోడోలాండ్ టెరిటోరియల్ రీజియన్ (బీటీఆర్) తదుపరి కౌన్సిల్‌ను ఎన్డీయే ఏర్పాటు చేస్తుందని అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ తెలిపారు.
మరోవైపు 2020 జనవరి 27న ఢిల్లీలో జరిగిన బోడో ఒప్పందంపై సంతకం తర్వాత ఇది రెండవ కౌన్సిల్ ఎన్నికలు. 2020 ఎన్నికల్లో 17 సీట్లతో ఏకైక అతిపెద్ద పార్టీగా బీపీఎఫ్ అవతరించింది. అయితే 12 స్థానాల్లో గెలిచిన యూపీపీల్, 9 స్థానాల్లో రాణించిన బీజేపీ, ఒక్క సీటులో గెలిచిన గణ సురక్ష పార్టీ (జీఎస్పీ)తో కలిసి కౌన్సిల్‌ను ఏర్పాటు చేసింది. అంతకు ముందు మూడేళ్లు వరుసగా కౌన్సిల్‌కు నేతృత్వం వహించిన బీపీఎఫ్ కూడా ఎన్డీయే కూటమిలో చేరింది. 2020 ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక స్థానాన్ని మాత్రమే గెలుచుకున్నది. ఆ పార్టీ నుంచి ఎన్నికైన సభ్యుడు ఆ తరువాత బీజేపీలో చేరాడు. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరూ గెలువలేదు.
Also Read:
Father Kills Daughter | డబ్బులు దొంగిలిస్తున్నదని.. కుమార్తెను హత్య చేసిన తండ్రి
Boy Hides To Skip Tuition | ట్యూషన్‌కు వెళ్లకుండా దాక్కున్న బాలుడు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: మహిళను గాల్లోకి విసిరిన ఎద్దు.. వీడియో వైరల్