Digital Arrest | హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 9 (నమస్తే తెలంగాణ): ‘మేం సీబీఐ నుంచి మాట్లాడుతున్నాం.. మీపై మానవ అక్రమ రవాణా కేసు నమోదైంది. ఈ కేసులో సుప్రీంకోర్టు మీపై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది’ అంటూ సైబర్ నేరగాళ్లు ఏకంగా ఓ రిటైర్డ్ న్యాయమూర్తినే బురిడీ కొట్టించి ఏకం గా రూ.1.66 కోట్లు దోచేశారు.
నేరెడ్మెట్ ప్రాంతంలో నివాసముండే బాధితుడికి ఫిబ్రవరి 23వ తేదీన ఓ ఫోన్ కాల్ వచ్చింది. ‘నేను సీనియర్ సీబీఐ ఆఫీసర్ దీపక్‌కుమార్‌ను మాట్లాడుతున్నాను. మీరు రెండు మొబైల్ ఫోన్లు వాడుతూ ఒక దాని నుంచి మహిళతో అనుచితంగా మాట్లాడుతున్నారని, మీపై బెంగుళూర్లోని ఇందిరానగర్ పోలీస్‌స్టేషన్ లో కేసు నమోదయ్యింది’ అని బెదిరించాడు. మళ్లీ, మీ ఆధార్ నంబర్‌తో ఎవరైనా సిమ్ కార్డు తీసుకొని ఆ నంబర్‌ను దుర్వినియోగం చేసి ఉంటారు అని చెప్పాడు. దీంతో బాధితుడు ఊరట చెందుతుండగానే.. కొద్దిసేపటికే ఓ వీడియో కాల్ వచ్చింది. తాను సర్కిల్ ఇన్స్పెక్టర్ గౌరవ్ సారథినంటూ పరిచయం చేసుకున్న వ్యక్తి.. మీపై మానవ అక్రమ రవాణా కేసు నమోదయ్యింది, ఇందుకు మీపై సుప్రీంకోర్టు నాన్‌బెయిలబుల్ వారంట్ జారీ చేసిందని చెప్పాడు.
మళ్లీ, ‘మీ ఆధార్ కార్డు దుర్వినియోగమైనట్టు ఒక లెటర్ రాసి రిక్వెస్ట్ పెట్టం డి, కేసు విచారణకు పూర్తిగా సహకరిస్తానని అందులో రాయండి’ అని సూచించాడు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులెవరికీ చెప్పొద్దని అన్నాడు. ఇంతలోనే సీనియర్ సీబీఐ ఆఫీసర్ అర్చనారామసుందరమ్ను మాట్లాడుతున్నానంటూ మరో మహిళ సుప్రీంకోర్టు చిహ్నంతో ఉన్న ఒక లెటర్‌ను చూపిస్తూ.. ‘మీరు మానవ అక్రమ రవాణా కేసులో ఉన్నారు. మీ ఆధార్‌ను ఇతరులు దుర్వినియోగం చేసినట్టు ఉన్నారు, కానీ అది ఇప్పుడు మీపైకి వచ్చింది’ అని బెదిరించారు. మీరు వెంటనే బయటపడాలంటే సుప్రీంకోర్టు అథారిటీస్‌ను మేనేజ్ చేయాల్సి ఉంటుంది, మీరు ఫైనాన్షియల్ అకౌంట్స్ వివరాలు కావాలంటూ తీసుకున్నారు. మళ్లీ.. ‘సుప్రీంకోర్టు మిమ్మల్ని మనీలాండరింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్తోపాటు ఐడెంటిటీ థెఫ్ట్‌కు సంబంధించిన కేసులలో నిందితుడిని చేసింది. మీరు వెంటనే వాట్సాప్ వీడియో కాల్లోకి చేరాలి’ అని సూచించారు. ఆ తరువాత బాధితుడి బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నట్టు నమ్మించి, బ్యాంకులో అసెస్మెంట్ కోసం దాచుకున్న రూ.1.66 కోట్లను దోచేశారు. కొద్దిసేపటికి తేరుకొని కుటుంబసభ్యులు, స్నేహితుల సహకారంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ మేరకు మల్కాజిగిరి సైబర్‌క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.