హనుమకొండ, ఆగస్టు 2 : విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖల దాడులు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొందరు రైస్ మిల్లర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వారం రోజులుగా జరుగుతున్న ఆకస్మిక తనిఖీలు దడ పుట్టిస్తున్నాయి. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వానికి సీఎంఆర్ పెట్టకుండా మొండికేస్తున్న పది రైస్ మిల్లులపై క్రిమినల్ కేసులు నమోదు చేయగా, తాజాగా శాయంపేట మండలం గట్లకానిపర్తిలో రెండు మిల్లులపై కేసులు నమోదు చేశారు. రానున్న రోజుల్లో మరిన్ని మిల్లులపై దాడులు జరిగే అవకాశం ఉండడంతో అవినీతి, అక్రమాలకు పాల్పడిన మిల్లర్లు వణికిపోతున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైస్ మిల్లర్లలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖల దాడులు కలకలం రేపుతున్నాయి. వారం రోజులుగా జరుగుతున్న ఆకస్మిక తనిఖీలతో మిల్లర్లలో దడపుట్టుకున్నది. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి కస్టం మిల్లింగ్ కోసం(సీఎంఆర్)ఆయా జిల్లాల్లోని రైస్ మిల్లులకు అప్పగించారు. ఈ ధాన్యాన్ని బియ్యంగా మార్చి ప్రభుత్వ నిబంధనల ప్రకారం సీఎంఆర్ పెట్టాల్సి ఉంటుంది.
అయితే, కొందరు మిల్లర్లు సకాలంలో సీఎంఆర్ పెట్టకుండా జాప్యం చేయడం, మొండికేయడం, బహిరంగ మార్కెట్లో అమ్ముకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్రమార్కులపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. సీఎంఆర్ పెండింగ్ ఉన్న మిల్లర్ల జాబితాను సిద్ధం చేసి సివిల్ సప్లయ్ అధికారులతో కలిసి దాడులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించిన మిల్లర్ల గుట్టును రట్టు చేస్తున్నారు. ధాన్యం నిల్వలు, సివిల్ సప్లయ్ నిబంధనల అమలు, ప్రభుత్వానికి అప్పగించాల్సిన బియ్యం నిల్వలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించడంతో మిల్లర్లలో ఆందోళన నెలకొంది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఆకస్మిక తనిఖీలు చేస్తుండడంతో మిల్లర్లు ఉకిరిబికిరవుతున్నారు.
కొన్ని రోజులుగా వరంగల్, మహబూబాబాద్ జిల్లాలలో ఆకస్మిక దాడులు చేసిన అధికారులు తాజాగా, నాలుగు రోజుల క్రితం హనుమకొండ జిల్లాలో తనిఖీలు నిర్వహించారు. నిల్వల్లో వ్యత్యాసం రావడంతో రైస్ మిల్లర్లపై కేసులు నమోదు చేశారు. మరోవైపు కేసుల నుంచి ఉపశమనం కల్పించాలని కొందరు మిల్లర్లు ప్రజాప్రతినిధుల వద్దకు పరుగులు పెడుతున్నట్లు సమాచారం. కాగా, ఈ తనిఖీల్లో అక్రమాలు వెలుగులోకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తుండడంతో మిల్లర్లలో గుబులు పట్టుకున్నది. రానున్న రోజుల్లో మరిన్ని రైస్ మిల్లులపై తనిఖీలు జరిగే అవకాశం ఉందని అధికార వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది.
విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆకస్మిక దాడులతో రైస్ మిల్లర్లలో ఆందోళన నెలకొంది. ఎప్పుడు ఏ మిల్లులో తనిఖీలు జరుగుతాయోనని అవినీతికి పాల్పడిన మిల్లర్లు వణికిపోతున్నారు. ఇప్పటికే వరంగల్, మహబూబాబాద్, హనుమకొండ జిల్లాల్లోని రైస్ మిల్లులుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేసి, నిల్వల్లో వ్యత్యాసం ఉన్న మిల్లుల యజమానులపై కేసులు నమోదు చేశారు. పకడ్బందీగా దాడులు చేస్తుండడంతో కొందరు మిల్లర్లు తమ వద్ద ఉండాల్సిన ధాన్యం, రికార్డులు, స్టాక్ వివరాలు సక్రమంగా ఉంచుకొనే పనిలో నిమగ్నం కాగా, మరికొందరు మిల్లర్లు సీఎంఆర్ పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇంకా కొందరు మిల్లర్లు దాడుల నుంచి తప్పించుకునేందుకు ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్లి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, సివిల్ సప్లయ్ అధికారులకు ఫోన్లు చేయిస్తున్నట్లు సమాచారం.
జిల్లాలోని శాయంపేట మండలం గట్లకానిపర్తిలోని శ్రీలక్ష్మీనర్సింహా, వినాయక ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో గత నెల 30వ తేదీన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మికంగా దాడులు చేశారు. 2025-26 ఖరీఫ్, రబీ సీజన్స్‌లో కేటాయించిన సీఎంఆర్ ధాన్యం నిల్వలపై ఫిజికల్‌గా తనిఖీలు చేపట్టారు. కేటాయించిన ధాన్యం, ఇప్పటి వరకు మిల్లరు ప్రభుత్వానికి పెట్టిన బియ్యం పోను ఉండాల్సిన ధాన్యం, ఇతర అంశాలను పరిశీలించినట్లు తెలిసింది. ఈ రెండు మిల్లుల్లో సుమారు రూ.9కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయమైనట్లుగా గుర్తించారు.
వీటిలో వినాయక ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో 2025-26 ఖరీఫ్, రబీ కలిపి మొత్తం రూ.4,61,29,753 విలువ చేసే 2079 మెట్రిక్ టన్నుల ధాన్యం, అలాగే లక్ష్మీనర్సింహా ఇండస్ట్రీ రైస్ మిల్లులో 2025-26 రబీకి సంబంధించి సుమారు రూ. 4,42,54,886 విలువ చేసే 1531.84 మెట్రిక్ టన్నుల ధాన్యం వ్యత్యాసం ఉన్నట్లు సివిల్ సప్లయ్ అధికారులు తెలిపారు. వీరిపై కేసులు నమోదు చేశామన్నారు. జిల్లాలోని పలు రైస్ మిల్లులపై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు ఇటీవల విసృ్తతంగా తనిఖీలు చేపట్టాయి. ధాన్యం కొనుగోళ్లు, నిల్వల రికార్డులు, సీఎంఆర్ బియ్యం లెకలు, గోదాముల్లో నిల్వ ఉంచిన ధాన్యం వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి.
రికార్డులకు భిన్నంగా నిల్వలు ఉన్నాయా, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించారా.. అనే అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తున్నది. అలాగే జిల్లాలో 2010-11 నుంచి 2023-24 మధ్య కాలంలో ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి 10 రైస్ మిల్లులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు సివిల్ సప్లయ్ అధికారులు తెలిపారు. ఈ మిల్లుల నుంచి సుమారు రూ.85,09,76,205 (25 శాతం జరిమానా కలుపుకొని) విలువ చేసే 75,302 మెట్రిక్ టన్నుల ధాన్యం బకాయి ఉన్నారని, అనేక సార్లు గడువు ఇచ్చినా మిల్లర్లు సీఎంఆర్ పెట్టలేదని, దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు అధికారులు చెప్పారు.
రైస్ మిల్లులకు కేటాయించిన ధాన్యం నిల్వలు లేకున్నా, గడువులోగా సీఎంఆర్ పెట్టకున్నా చర్యలు తీసుకుంటాం. తనిఖీల్లో వ్యత్యాసం వస్తే కేసులు నమోదు చేస్తాం. అలాగే డిఫాల్ట్ మిల్లర్ల నుంచి రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం రికవరీ చేస్తాం. 2010-11 నుంచి 2023-24 మధ్య కాలంలో ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న10 రైస్ మిల్లర్లపై ఇప్పటికే క్రిమినల్ కేసులు నమోదు చేశాం. తాజాగా, ఈ నెల 30వ తేదీన జిల్లాలోని శాయంపేట మండలం గట్లకానిపర్తిలోని రెండు మిల్లులో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీ చేయగా నిల్వల్లో వ్యత్యాసం రావడంతో ఇద్దరిపై కేసులు నమోదు చేశాం.
– యు. మహేందర్, ఇన్చార్జి డీసీఎస్వో, హనుమకొండ జిల్లా