గ్లాస్గో : కామన్వెల్త్ క్రీడలు జరుగుతున్న స్కాట్లాండ్ రాజధాని గ్లాస్గోలో గల భారత సంతతి రెస్టారెంట్ ఒకటి దేశ చిత్రపటాన్ని తప్పుగా ముద్రించి విమర్శల పాలైంది. ఈశాన్య రాష్ర్టాల్లేకుండానే పటాన్ని అంసపూర్తిగా ముద్రించడం వివాదాస్పదమైంది. వివరాల్లోకెళ్తే.. ఈ క్రీడల్లో ఏకంగా ఏడు స్వర్ణాలతో సత్తాచాటిన భారత బాక్సింగ్ బృందం తమ విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు గాను స్థానికంగా ఉన్న ‘మిస్టర్ సింగ్స్ ఇండియా ది హోమ్ ఆఫ్ కర్రీ’ అనే రెస్టారెంట్‌కు వెళ్లింది. అక్కడ నిర్వాహకులు బాక్సర్లకు భారత చిత్రపటం ఉన్న న్యాప్కిన్లు ఇచ్చారు.
అయితే వాటిపై ఈశాన్య రాష్ర్టాలు లేవని గుర్తించిన లవ్లీనా బోర్గోహెయిన్ నిర్వాహకులను ఉద్దేశిస్తూ.. ‘మీరు దీనిని తప్పుగా అనుకోకండి. ఈ మ్యాప్‌లో నార్త్ ఈస్ట్ మిస్ అయింది. హోటల్ ముందు బోర్డులోనూ ఇలాగే ఉంది. ఒక నార్త్ ఈస్ట్‌గా నాకు ఇది చాలా బాధ కలిగించింది. భారత్‌లో ప్రతి ప్రాంతం ముఖ్యమైనదే. మళ్లీ ఇలా జరుగకుండా చూసుకోండి’ అని తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. అక్కడే ఉన్న బాక్సింగ్ కోచ్ అజయ్ సింగ్ సైతం.. నార్త్ ఈస్ట్ మాత్రమే కాదు, అందులో జమ్మూకాశ్మీర్‌నూ తప్పుగా ముద్రించారని అన్నాడు. కాగా దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో హోటల్ నిర్వాహకులు తమ తప్పును సరిదిద్దుకుంటామని హామీ ఇచ్చినట్టు అజయ్ సింగ్ తెలిపారు.