డప్పు చప్పుళ్లు.. పోతరాజుల విన్యాసాలు.. శివసత్తుల పూనకాలు.. సాంస్కృతిక కళారూపాలతో లష్కర్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నది. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవం ఆదివారం అత్యంత వైభవంగా సాగింది. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు..అమ్మవారికి బోనం సమర్పించి.. మొక్కులు చెల్లించుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మల్లారెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, ఇతర ప్రముఖులు, ప్రజాప్రతినిధులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి చల్లని దీవెనలతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి.. రైతులు సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని మాజీ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆకాంక్షించారు. కాగా, క్యూలైన్లలో వచ్చిన భక్తులకు సేవా సంస్థల వలంటీర్లు సేవలు అందించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
-బేగంపేట్

Ktr
బేగంపేట్, ఆగస్టు 2: లష్కర్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాలు ఆదివారం వైభవంగా జరిగాయి. బోనాల ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ఉదయం 3.30 గంటలకు మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు తొలి బోనం సమర్పించారు. అనంతరం 4.05 గంటల నుంచి భక్తులకు అమ్మవారి దర్శనం, బోనాలు సమర్పించేందుకు అనుమతి ఇచ్చారు. మధ్యాహ్నం 12.45 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అమ్మవారికి బోనం సమర్పించి, దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. బోనాల సందర్భంగా దేవదాయ శాఖ భక్తులకు కావలసిన ఏర్పాట్లు చేసింది. పోలీసులు భక్తుల భద్రత కోసం భారీ బందోబస్తు చేశారు. ప్రత్యేక క్యూలైన్ల ద్వారా భక్తులు వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించారు.
ప్రధానంగా అమెరికన్ కాన్సులేట్ జనరల్ లారా విలియమ్స్ అమ్మవారికి బోనం సమర్పించారు. గద్దర్ కూతురు వెన్నెల, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సతీమణి అమ్మవారికి బోనం సమర్పించారు. గత రెండేళ్లతో పోలిస్తే ఈ సారి భక్తులు అధికంగా రావడంతో అమ్మవారి ఆలయం ఆర్చిగేట్ ద్వారా వీఐపీల దర్శనానికి అనుమతిచ్చారు. దేవాలయానికి వీఐపీలు వచ్చి దర్శనం చేసుకునే సమయంలో భక్తులను బోనాల క్యూలైన్లో అరగంట పాటు నిలిపివేయడంలో అసహనానికి గురయ్యారు.
బోనాలతో వచ్చిన మరికొంతమంది భక్తులు క్యూలైన్లో సృహ తప్పి పడిపోయారు. వారికి అప్పటికప్పుడు వైద్య సిబ్బంది వైద్య సేవలు అందించారు. ప్రధానంగా ఆర్చిగేట్ నుంచి అనుమతించిన శివసత్తుల బోనాలను తీసుకొచ్చే క్రమంలో పలువురి బోనాలు సైతం కిందపడిపోయాయి. ఇది బోనాల చరిత్రలోనే మొదటిసారని భక్తులు భావిస్తున్నారు. క్యూలైన్లలో వచ్చిన భక్తులకు వివిధ సేవా సంస్థల వాలంటీర్లు మంచినీటిని అందించి దర్శనం చేసుకునేందుకు సహకరించారు. ఉత్తర మండలం పోలీసులు డీసీపీ రక్షిణ మూర్తి నేతృత్వంలో అడిషనల్ డీసీపీ నర్సయ్య, ఏసీపీ శ్రీధర్ల ఆధ్వర్యంలో పోలీసులు భద్రత ఏర్పాట్లు చేపట్టారు. భారీ బందోబస్త్ నడుమ జాతర ఉత్సవాలు విజయవంతమయ్యాయి.

అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం మహంకాళి అమ్మవారిని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ దర్శించుకున్నారు. అలాగే మంత్రి సీతక్క, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మల్లారెడ్డి, జగదీశ్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర్‌రెడ్డి, కాలేరు వెంకటేష్, దానం నాగేందర్, శ్రీగణేష్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మాజీ ఎంపీ హనుమంతరావు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయలు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అలాగే కలెక్టర్ ప్రయాంక, పలువురు జడ్జీలు, అమ్మవారిని దర్శించుకున్నారు.
ఆకట్టుకున్న శివసత్తుల పూనకాలు
బోనాల ఉత్సవాల్లో భాగంగా భక్తులు, మహిళల బోనాలతోపాటు, శివసత్తులు సమర్పించే బోనాలు ఆకర్షణీయంగా తయారు చేశారు. వాటిని డప్పు చప్పుళ్లు, బాజాభజంత్రీలతో ఊరేగింపుగా తీసుకొచ్చి మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించారు. బోనాలతో మహిళలు ఈ సారి రెట్టింపు సంఖ్యలో వచ్చినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. కానీ దేవాలయం వద్ద గతంతో పోలిస్తే తోపులాట కూడా అధికంగా కనిపించింది. పోలీసులు వారిని కంట్రోల్ చేసేందుకు నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది.



Malla Reddy