MLA Palla Rajeshwar Reddy : అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులు తనపై చేసిన అసత్య ప్రచారాన్ని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి (MLA Palla Rajeshwar Reddy) ఖండించారు. వట్టినాగులపల్లిలో తాను భూదాన్ భూమిని కొనుగోలు చేశానని వస్తున్న తప్పుడు ఆరోపణలు, కథనాలన్నీ అవాస్తమని ఆయన పేర్కొన్నారు. న్యాయ సలహా, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించాకే అక్కడ భూమి తీసుకున్నానని, అది భూదాన్ భూమి కాదని పత్రికా ప్రకటనలో పల్లా స్పష్టం చేశారు.
వట్టినాగులపల్లిలో తాను భూదాన్ భూమి కొనుగోలు చేశానంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తిప్పికొట్టారు. తాను కొన్నది భూదాన్ భూమి కాదని, అన్నీ సరిగ్గా ఉన్నాయని తెలిశాకే అగ్రిమెంట్ చేసుకొని.. రిజిష్ట్రేషన్ చేసుకున్నానని ఆయన ప్రకటన విడుదల చేశారు.
‘వట్టినాగులపల్లిలో నేను కొనుగోలు చేసింది భూదాన్ భూమి కాదు. అక్కడ నాకున్నది ఎకరం 10 గుంటలు మాత్రమే. నేను 2012లో వట్టినాగులపల్లి సర్వే నంబర్ 188/1/2లో పూర్తి వివరాలు తెలుసుకొని, న్యాయ సలహా తీసుకొని, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించాను. అన్నీ సవ్యంగా ఉన్నాయనే తెలిశాకే 2012లోనే అగ్రిమెంట్ చేసుకొని.. 2014లో రిజిస్ట్రేషన్ చేసుకున్నా. ఈ భూమి వివరాలను 2015, 2021, 2023 ఎన్నికల అఫిడిట్లలోనూ పొందుపరిచాను. నేను కొన్నది భూదాన్ భూమి కాదు అనడానికి సంబంధించిన పత్రాలను కూడా సమర్పించాను. ఇంకా ఎవరికైనా వివరాలు కావాలంటే ప్రభుత్వపరంగా సంబంధిత రికార్డులను వెరిఫికేషన్ చేసుకోవచ్చు లేదా నేరుగా నన్ను సంప్రదించినా పూర్తి వివరాలు తెలియజేస్తాను.
Whatsapp Scan 12 September 2026 at 20.36.06
వట్టినాగులపట్టిలో నాకు ఉన్నది ఎకరం 10 గుంటలు మాత్రమే. అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులు పేర్కొన్న 29 ఎకరాల భూముల్లో భాగం కాదు. ఆ 29 ఎకరాల్లో లేని భూమిని నాపేరు మీద ఉందని.. అది భూదాన్ భూమి అని దుష్ప్రచారం చేయడం వారి దురుద్దేశపూరిత వైఖరిని తెలియజేస్తుంది. భూదాన్ భూమి కొన్నావంటూ రెవెన్యూ మంత్రికి ఉద్దేశపూర్వకంగానే నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. అసెంబ్లీ వేదికగా నాపై, మా బీఆర్ఎస్ నాయకులపై అసత్య ఆరోపణలు, దుష్ప్రచారం చేయడం ఆయనకు అలవాటుగా మారింది. వాస్తవాలు, అధికారిక రికార్డులు అందుబాటులో ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదు. ఈ అసత్య ప్రచారాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా అని రాజేశ్వర్ రెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు.