హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల దోపిడీ కొత్త పుంతలు తొక్కుతున్నదని, కొత్తదారుల్లో ఖజానాకు గండి కొడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భూములు, గనులు, కమీషన్లు.. ఇలా దొరికిన ప్రతిచోటా దోచుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్న సమయంలోనే కొత్త తరహా కాసుల వేట తెరమీదికి వచ్చింది. ప్రభుత్వ కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారం పేరుతో రూ.కోట్లు కొల్లగొట్టేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యనేత బినామీ కంపెనీకి ప్రభుత్వ కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసార హక్కులను ధారాదత్తం చేసినట్టు విమర్శలున్నాయి. శాసనసభ, శాసనమండలి సమావేశాలతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే అనేక కార్యక్రమాల ప్రసార బాధ్యతలను ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ఖజానా నుంచి ప్రతి నెలా ఈ సంస్థకు రూ.5 కోట్ల వరకు చేరుతున్నాయని చెప్పుకొంటున్నారు. శాసనసభ, శాసనమండలి ప్రసారాల చెల్లింపులు దీనికి అదనమని సమాచారం.
వాస్తవానికి ఆ కంపెనీకి గతంలో ఎలాంటి అనుభవం లేకపోయినా ‘పెద్ద’లకు చెందిన సంస్థ కావడంతో బాధ్యతలు అప్పగించారని విమర్శలున్నాయి. అప్పటి నుంచి ఆ సంస్థ చెప్పిందే వేదం, ఆడిందే నాటకం అన్నట్టుగా సాగుతున్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంస్థ అడ్డగోలుగా బిల్లులు పెడుతున్నదని, గ్రీన్ చానల్ ద్వారా ప్రతినెలా ఠంచనుగా వాటిని ఇప్పించుకుంటున్నదని గుసగుసలు వినిపిస్తున్నాయి. మధ్యవర్తులు లేరు, అధికారుల కొర్రీలు లేవు, పర్సంటేజీల వ్యవహారమే లేదని ముఖ్యనేత కార్యాలయం నుంచి ఫోన్ రాగానే ఐ ఆండ్ పీఆర్ నుంచి ఆటోమెటిక్‌గా బిల్లుల చెల్లింపు జరుగుతున్నదని తెలుస్తున్నది. తాజాగా తమకు రేట్లు పెంచాలని సంస్థ డిమాండ్ చేస్తున్నదని, కొన్ని రోజులుగా ప్రత్యక్ష ప్రసారాలు కూడా చేయడం లేదని సమాచారం.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేసిన సంస్థకు రూ.5 లక్షలు చొప్పున చెల్లించేవారని సమాచారం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కో లైవ్‌కు రేటు పెంచి రూ.6.5 లక్షలకు చేర్చారు. ముఖ్యనేత బినామీ కంపెనీ కోసమే రేట్లు పెంచారని విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా ఈ మొత్తాన్ని మరింత పెంచాలని సదరు కంపెనీ కొత్త నాటకం మొదలు పెట్టిందని సమాచారం.
తమకు ప్రభుత్వం ఇస్తున్న రూ.ఆరున్నర లక్షలు సరిపోవడం లేదని, ఒక్కో కార్యక్రమానికి రూ.8.5 లక్షలు చెల్లించాలని ముఖ్యనేత బినామీ కంపెనీ ప్రతినిధులు అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఉన్నంతలో అత్యధిక ధర చెల్లిస్తున్నామని, పైగా ఒక్కసారిగా రూ.2 లక్షలు పెంచితే ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులు మొత్తుకుంటున్నా వారు పట్టించుకోవడం లేదట.
పైగా ‘ఓ నాలుగు రోజులు మేం ప్రసారాలు నిలిపివేస్తాం, మీరు మాతో చర్చలు జరిపినట్టు నాటకం ఆడి రూ.8.5 లక్షలకు పెంచండి’ అంటూ ముఖ్యనేత బినామీ కంపెనీ వారే ఉచిత సలహా ఇచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది. ఇప్పుడు ఆ డ్రామా అమలవుతున్నదని చెప్పుకొంటున్నారు. నాలుగు రోజులుగా ముఖ్యనేత బినామీ కంపెనీ ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేసిందని తెలుస్తున్నది. ఐ అండ్ పీఆర్ అధికారులు ప్రత్యామ్నాయంగా వేరే కంపెనీ ద్వారా లైవ్ కార్యక్రమాలు ఇస్తున్నారని సమాచారం. ఇది తాత్కాలిక సర్దుబాటు మాత్రమేనని, బినామీ కంపెనీకి రేటు పెంచి, మళ్లీ వారికే లైవ్ షోల కాంట్రాక్టు ఇస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ముఖ్యనేత బినామీ కంపెనీ రెండున్నరేండ్లుగా వివిధ ప్రత్యక్ష ప్రసారాల పేరుతో రూ.150 కోట్లకుపైగా బిల్లులు వసూలు చేసిందని ప్రచారం జరుగుతున్నది. సదరు కంపెనీ యజమానులు ఒక శాటిలైట్ చానల్ సైతం నడుపుతున్నారట. కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు ఆ చానల్‌ను అక్కడ కూడా విస్తరించారని తెలిసింది. అక్కడ చానల్ నిర్వహణ ఖర్చులు, ఇతర అవసరాలను తీర్చుకోవడానికే ఇక్కడ ప్రత్యక్ష ప్రసారాల రేట్ల పెంపు డ్రామా నడుపుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.