తమ ఆస్తులు 22ఏలో అన్యాయంగా చేర్చారంటూ బాధితులు జనతా గ్యారేజీ (బీఆర్ఎస్ భవన్)కి బారులు తీరారు. ప్రభుత్వమే తమను దోచుకోవాలని చూస్తే ఆదుకునేవారు కరువైన సమయంలో బీఆర్ఎస్ నాయకులు అండగా నిలబడటంతో వాళ్లంతా కొంత ఊపిరిపీల్చుకున్నారు. తమ సమస్యలు వినడానికి ఇక్కడో జనతా గ్యారేజీ ఉంది. అందులో ఓ పెద్దాయన ఉన్నాడనే ధీమాను బీఆర్ఎస్ పార్టీ బాధితులకు కల్పించింది. తమ భవిష్యత్ కలలు రేవంత్ పాలనలో కుప్పకూలిపోయాయంటూ కన్నీటి పర్యంతమైన బాధితులకు పెద్ద దిక్కై నిలిచిన జనతా గ్యారేజీ.. వారికి న్యాయం జరిగే వరకు లీగల్ సెల్‌ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా బాధితుల కష్టాలు తెలుసుకున్న మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. పది మంది న్యాయవాదులతో ఏర్పాటు చేసిన లీగల్ సెల్ ద్వారా బాధితులకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామని చెప్పారు. ఉచిత న్యాయం కోసం న్యాయవాది కల్యాణ్‌ను 812535604 నంబర్లో సంప్రదించవచ్చని తెలిపారు.
సిటీబ్యూరో, ఆగస్టు 19 (నమస్తేతెలంగాణ) : 22ఏ బాధితులు ఆందోళన చెందవద్దని, కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ వారికి అన్ని విధాలా అండగా ఉంటుందని మాజీ మంత్రి హరీశ్ రావు భరోసా ఇచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణభవన్ (జనతా గ్యారేజ్)లో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 22ఏ నిషేధిత జాబితా కారణంగా నష్టపోయిన బాధితులతో హరీశ్‌రావు ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలను విన్నారు. 22 ఏ పేరుతో ప్రజలను భయపెట్టి 20, 30 శాతం కమీషన్లు వసూలు చేసే ప్రయత్నాలకు బాధితులు లొంగవద్దని హరీశ్‌రావు సూచించారు. తకువ ధరలకు ఆస్తులను అమ్ముకోవద్దని, ఎంతటి పోరాటానికైనా సిద్ధమై ప్రభుత్వం మెడలు వంచి బాధితుల ఆస్తులను రక్షించే బాధ్యతను బీఆర్ఎస్ తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.
లీగల్ సెల్ సహాయంతోపాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికారులను, కలెక్టర్లను కలిసి సమస్య పరిషారమయ్యే వరకు బాధితుల తరఫున పోరాడుతారని అభయమిచ్చారు. హుడా, హెచ్ఎండీఏ అనుమతులతో ఏర్పాటైన లేఅవుట్లలో 30 ఏండ్ల కిందట కొనుగోలు చేసిన ఇళ్లను సైతం ఇప్పుడు 22 ఏ జాబితాలో చేర్చడం వెనుక భారీ కమీషన్ల దందా ఉన్నదని హరీశ్‌రావు ఆరోపించారు. బుద్వేల్లోని సర్వే నంబర్లు 282, 283, 284లోని సుమారు 30 ఎకరాల భూమిని ఒత్తిళ్ల ద్వారా రాత్రికి రాత్రే 22 ఏ నుంచి తొలగించి కోట్ల రూపాయల దందా చేశారని ఆరోపించారు. శేరిలింగంపల్లి సర్వే నంబర్లు 20/1, 21లోని భూములకు సంబంధించి 30 శాతం కమీషన్ తీసుకుని 22 ఏ నుంచి తొలగించి రిజిస్ట్రేషన్లు చేయించారని, బిల్డర్ పని పూర్తయిన తర్వాత మళ్లీ 22ఏలో చేర్చారని ఆయన పేరొన్నారు.

Sabitha2
సంగారెడ్డి సమీపంలోని శిల్పా మోహన్‌రెడ్డి భూమి విషయంలోనూ ఇదే తరహాలో వ్యవహరించారని ఆరోపించారు. అమీన్పూర్ కేఎస్ఆర్ కాలనీలో సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికీ సుమారు 500 ఇండ్లను 22ఏలో చేర్చి కాలనీవాసులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. 2008లోనే సీలింగ్ రద్దయి, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అనుమతులతో నిర్మించుకున్న ఇండ్ల్లను ఇప్పుడు సీలింగ్ భూములుగా పేరొనడం దుర్మార్గమని మండిపడ్డారు. అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే భూభారతి వెబ్‌సైట్‌ను డౌన్ చేసి హైదరాబాద్ జిల్లా భూములకు సంబంధించిన వివరాలు కనిపించకుండా చేశారని ఆరోపించారు. ప్రజలను మీ-సేవ కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పకుండా, ప్రభుత్వం చేసిన తప్పును ప్రభుత్వమే సుమోటోగా స్వీకరించి ఆన్లైన్లో 22ఏ ఆంక్షలను తొలగించాలని డిమాండ్ చేశారు.
రేవంత్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి రియల్ ఎస్టేట్ వ్యాపారం తెలిసి ఉండొచ్చని, బీఆర్ఎస్ నాయకులకు మాత్రం ప్రజల తరఫున ప్రాణాలకు తెగించి పోరాడటం తెలుసని వ్యాఖ్యానించారు. 22ఏలో చేర్చిన భూములను చట్టబద్ధంగా ఎలా బయటకు తీయాలో తమకు తెలుసని, బాధితులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వం వెంటపడతామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఒకటి రెండు రోజుల్లో స్పందించి అక్రమంగా 22ఏ నిషేధిత జాబితాలో చేర్చిన భూములను పునరుద్ధరించకపోతే బాధితులతో కలిసి పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని హరీశ్ రావు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, భాస్కర్‌రావు, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, పార్టీ నేతలు తుల ఉమ, ఎర్రోళ్ల శ్రీనివాస్, కిశోర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.