మిడిల్ క్లాస్.. పన్నులు కడుతూ పథకాలు అందుకోలేని ప్రత్యేక వర్గం. అలాగని వారికవేవీ అవసరం లేవా అంటే అదీ కాదు. ఓ మెట్టు దిగి అవసరాలకు ఎవరి దగ్గరా చేయి చాపలేరు. అన్ని అవసరాలూ అమరిపోయేంత స్థాయిలోనూ కనిపించరు. ఓ రకంగా అత్యంత నిరాదరణ పొందే వర్గం. అలాంటి వాళ్లకు విద్య, వైద్యంలో చేతనైన సహాయం చేయాలన్న తపనతో ‘డా॥నారి చారిటబుల్ ట్రస్ట్’ను ప్రారంభించారు డాక్టర్ నర్లింగల కీర్తనా యాదవ్. చిన్ననాడు ఫీజు కట్టలేదని తనను బయటికి పంపిన సందర్భమే సేవాస్ఫూర్తిని రగిలించిందని చెప్పే ఆమెతో ‘జిందగీ’ ముచ్చటించింది. ‘సర్వింగ్ మిస్సింగ్ మిడిల్’ పేరిట ఆమె చేస్తున్న వివిధ కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకుంది. అవన్నీ ఆమె మాటల్లోనే..
అవసరం ఉన్న వారికి… ఉన్నా నోరు తెరిచి అడగలేని వారికి నా వంతు సేవ చేయాలన్న తపన తొలి నుంచీ ఉండేది. ఎందుకంటే నాకు ఆ పరిస్థితి తెలుసు. మనదేశంలోని అతిపెద్ద వర్గమైన మధ్యతరగతి నుంచే వచ్చాను. నేను నాలుగో తరగతి చదువుతున్నప్పుడు అనుకుంటా… పాఠశాలలో ఫీజు కట్టలేదని ఇంటికి పంపించారు. బాగా చదువుకొని నాలాంటి పిల్లలకు సాయం చేయాలని అప్పుడే అనుకున్నా. అందుకే ఈ ఫౌండేషన్ పెట్టకముందు నుంచీ కూడా ఏడాదికి ఇద్దరు పిల్లలకి బడి ఫీజు కడుతూ వచ్చాను. డాక్టర్‌గానూ నాకున్న పరిచయాలను కూడా ఇలాంటి వారికి సేవ చేయడానికే ఉపయోగించాను.
మాది హైదరాబాదే. అమ్మ సుజాత, నాన్న వేణుగోపాల్. నన్ను డాక్టర్ చదివించాలని అమ్మకు ఎంతో ఇష్టం. మా చెల్లిని ఇంజినీర్ని చేశారు. ఖమ్మంలో ఎంబీబీఎస్ చేసి ముంబై కోకిలా బెన్ ఆసుపత్రిలో డీఎన్బీ అనస్థీషియాలో చేరా. తర్వాత ఎయిమ్స్ నుంచి ఎమర్జెన్సీ మెడిసిన్‌లో శిక్షణ తీసుకున్నా. ఇక, ప్రస్తుతం ఉస్మానియా మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నా. రెడ్‌క్రాస్ స్వచ్ఛంద సంస్థతో కలిసి చాలాకాలం పనిచేశా. ఎంబీబీఎస్ పూర్తయ్యాక స్నేహితులతో కలిసి మెడికల్ క్యాంపులు నిర్వహించా. అంతేకాదు, మహిళా డాక్టర్లలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేలా, వాళ్ల శక్తి సామర్థ్యాలను వెలికితీసేలా నాలుగేండ్ల క్రితం ‘ఉమెన్ డాక్టర్స్ క్రికెట్ లీగ్’ని ఏర్పాటు చేశాం. అది బాగా సక్సెస్ అయింది. ఆ సందర్భంలోనే మా సేవా కార్యక్రమాలకు ఒక వేదిక కావాలని నిర్ణయించుకున్నా. అలా 2023 సంవత్సరంలో పుట్టిందే ‘డాక్టర్ నారి చారిటబుల్ ట్రస్ట్’. అమ్మ ఇందులో సహ వ్యవస్థాపకురాలు.

ఫౌండేషన్ పెట్టడం అంటే మేమేమీ నిధులను జమ చేసే ప్రయత్నం చేయలేదు. కానీ, నాకున్న నెట్‌వర్క్‌నే నిధిగా మలుచుకున్నా. నా స్నేహితుల్లో చాలామందికి సేవ చేయాలన్న తపన ఉంటుంది. అలాంటి వాళ్లతో కలిసి పనిచేస్తున్నా. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆపరేషన్ల ఖర్చులు భరించలేని వాళ్ల స్తోమతను బట్టి తక్కువ డబ్బుకే వైద్యం చేసి పెడతారు నా మిత్రులు. మా టీంలో కంటి డాక్టర్ల నుంచి ఆంకాలజిస్టుల దాకా అందరూ ఉన్నారు. నరాల సర్జరీ, శుక్లాలు, గర్భాశయ సంబంధిత శస్త్రచికిత్సలు… ఇలా మొత్తం కలిపి మా ఫౌండేషన్ ద్వారా 30 నుంచి 40 దాకా చేశాం. ఒంటరిగా ఉండే ఆడవాళ్లు, సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన వాళ్లు… ఇలా ఎవరికి అవసరం ఉందనిపిస్తే వాళ్లకి మా సాయం అందిస్తున్నాం. అయితే మేమేమీ ఉచితంగా ఈ సేవలు చేయం. వాళ్లు భరించగలిగినంతలో వైద్యం అందిస్తున్నాం. ఇక, మధ్యతరగతి వాళ్లు పిల్లల్ని గవర్నమెంటు బళ్లలో వేయలేకపోతున్నారు. ప్రైవేటు బళ్లు అడిగినంత ఫీజు కట్టలేకపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న పిల్లల్ని ఎంచుకుని ఇప్పటి దాకా 16 మందికి బడిఫీజు కట్టాం.
మా కార్యక్రమాల్లో బాగా రెస్పాన్స్ వచ్చింది ‘ఉమెన్స్ క్రికెట్ లీగ్’కి. అందుకే దీన్ని గత నాలుగేండ్ల నుంచి కొనసాగిస్తూ ఉన్నాం. తొలిగా డాక్టర్లకే పెట్టినా, తర్వాత పోలీసులు-డాక్టర్లు… ఇలా వేరు వేరు వర్గాల వారికి నిర్వహిస్తూ వెళ్లాం. ఒకసారి కేటీఆర్ గారు కూడా మా కార్యక్రమానికి వచ్చారు. అయితే ఈ లీగ్ ద్వారా వచ్చిన డబ్బును ఒక్కోసారి ఒక్కో మంచిపని కోసం వాడుతున్నాం. ఒక మ్యాచ్‌వి పేద అథ్లెట్లకు బూట్లు, దుస్తులు, ఇతర అవసరమైన ఆట వస్తువులు కొనడానికి వినియోగించాం. మరోసారి ఆర్గానిక్ రైతులను ప్రోత్సహించడానికి ఖర్చుచేశాం. ఇక, హెల్త్ క్యాంపులు, క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నాం. అలాగే మహిళల కోసం ఆర్థిక పాఠాలూ చెప్పిస్తున్నాం. యువతకు చదువు పట్ల అవగాహనా సదస్సులు, విలువలను పెంపొందించేలా కథల ద్వారా నీతి పాఠాలు చెబుతున్నాం. డ్రగ్స్‌కు దూరంగా ఉండేలా తరగతులు పెడుతున్నాం. నేటి కాలానికి ఎంతో అవసరమైన యాంటీ రేడియేషన్ ప్రోగామ్‌లను కూడా నిర్వహిస్తున్నాం. సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు సహా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి వచ్చే రేడియేషన్‌ను ఎలా తగ్గించుకోవచ్చు అన్నది చెబుతాం. మా ద్వారా సహాయం పొందడానికే కాదు, మాతో కలిసి పనిచేయడానికీ చాలామంది స్వచ్ఛందంగా ముందుకు రావడం సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది.
ఇక నా సంగతికి వస్తే నా భర్త కూడా డాక్టరే. మాకు ఆరేండ్ల పాప. నా ఉద్యోగం, ఇంటి బాధ్యతలు పూర్తయ్యాక మిగిలే సమయాన్ని సేవ కోసం కేటాయిస్తా. అటు అమ్మానాన్నతో పాటు మా అత్తింటివారూ దీనికి సహకరిస్తున్నారు. నేను వృత్తిలో భాగంగా చాలామంది విద్యార్థులకు శిక్షణనిస్తా. అలాంటప్పుడు పేషంట్లతో ఎంత గౌరవంగా వ్యవహరించాలి అన్న విషయాన్ని తప్పకుండా చెబుతా. ఉచిత వైద్యమే అయినా సరే మనం వ్యక్తిగా ఎప్పుడూ ఉన్నతంగా ఉండాలన్నది సూచిస్తా. నా పిల్లలు నా మాట వింటారు. అంతేకాదు, మా క్యాంపెయిన్లలోనూ భాగమవుతుంటారు. ఇక, ఈ ఫౌండేషన్ ద్వారా మేం చేస్తున్న సేవలకు గానూ ఇటీవల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నుంచి కమ్యూనిటీ సర్వీస్‌లో నేషనల్ అవార్డును కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేతుల మీదుగా అందుకున్నా. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి ఉమెన్ ఆఫ్ ఇంపాక్ట్ అవార్డు-2025తో పాటు, అదే ఏడాది తెలంగాణ ప్రభుత్వం తరఫున మెడికల్ ఎక్సలెన్స్ అవార్డును రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా అందుకున్నా. నా జీవితం నా ఒక్కదానిది మాత్రమే అని ఎప్పుడూ అనుకోను. అది నలుగురి కోసం ఉండాలనే కోరుకుంటూ. నేను వెలుగుతూ మరో నలుగురి జీవితాలలో వెలుగు నింపాలనే కోరిక ఎప్పుడూ ఉంటుంది. ఏ రూపంలో చేసినా చివరికి అదే నా లక్ష్యం.

గుండె ఆగిపోయిన మనిషికి తిరిగి ప్రాణం పోసే ప్రక్రియ సీపీఆర్. దీన్ని ఎంత మందికి నేర్పిస్తే సమాజానికి అంత మేలు చేసిన వాళ్లమవుతాం అన్నది మా సంకల్పం. అందుకే తెలంగాణ వ్యాప్తంగా కాలేజీలు, కోర్టులు, పోలీసు కార్యాలయాలు… సహా వివిధ చోట్ల క్యాంపులు నిర్వహించి ఇప్పటి దాకా సుమారు లక్ష మందికి సీపీఆర్ ట్రైనింగ్ ఇచ్చాం. రెడ్ క్రాస్, హ్యాండ్స్ ఆన్ హార్ట్ ఫౌండేషన్లు మాతో కలిసి పనిచేస్తున్నాయి. దీనితో పాటుగా కొన్ని అత్యవసర ప్రాథమిక చికిత్సలనూ మేం పౌరులకు నేర్పుతున్నాం.
కరెంట్ షాక్ కొట్టినప్పుడు, పాము కరచినప్పుడు, ఫిట్స్ వచ్చినప్పుడు, పిల్లలకు ఏదైనా గొంతులో అడ్డుపడినప్పుడు, బీపీ డౌన్ అయితే, షుగర్ స్థాయులు పడిపోతే… ఇలా ప్రాణం పోయే పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేర్చేలోగా ఆ వ్యక్తికి ఎలాంటి సాయం అందించాలి అనేది కూడా ఈ క్యాంపెయిన్‌లో భాగంగా నేర్పుతాం. ఎవరైనా మా కార్యక్రమంలో భాగమవ్వాలనుకుంటే drnaari అనే ఇన్స్టాగ్రాం పేజీ లేదా drnaari.com అనే మా వెబ్సైట్ ద్వారా కానీ సంప్రదించవచ్చు.