హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ) : ఓటర్ల జాబితాలోని వ్యత్యాసాలు (అనామలిస్), నో-మ్యాపింగ్ కేసులతోపాటు దరఖాస్తులు, అభ్యంతరాల పరిషారంపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) సీ సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నియోజకవర్గ, పోలింగ్ కేంద్రాలవారీగా సమయానుకూల కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)-2026 ప్రక్రియపై బుధవారం ఆయన తన కార్యాలయం నుంచి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
అదనపు సీఈవో డాక్టర్ వాసం వెంకటేశ్వర్‌రెడ్డి, డిప్యూటీ సీఈవో జీఎస్ చారిలతో కలిసి జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు (డీఈవోలు), నియోజకవర్గాల ఓటర్ల నమోదు అధికారులు (ఈఆర్వోలు), ఏఈఆర్వోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. ఓటర్లకు నోటీసులు జారీ చేయడం, డాక్యుమెంట్ల పరిశీలన, విచారణల ఆధారంగా దరఖాస్తులు, అభ్యంతరాలను పరిషరించాలని సూచించారు.
హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ) : సవాళ్లకు అనుగుణంగా పోలీసు శాఖలో మానవ వనరులను పునర్‌వ్యవస్థీకరిస్తున్నట్టు డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. బుధవారం పోలీస్ అకాడమీలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డ్రగ్స్, సైబర్, బెట్టింగ్, పెట్టుబడి, ట్రాఫిక్, రోడ్డుభద్రత, ఆహారకల్తీ పోలీసులకు సవాళ్లుగా మారిన నేపథ్యంలో గ్రేహౌండ్స్, ఆక్టోపస్, ఎస్ఐబీ నుంచి 513 మంది సిబ్బందిని 8 విభాగాలకు కేటాయించామని వెల్లడించారు.
ఐదుగురు సీఐలు, 22 మంది ఎస్సైలు, 14 మంది ఏఎస్సైలు, 84 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 388 మంది కానిస్టేబుళ్లు ఉన్నట్టు తెలిపారు. 224 మందిని ట్రాఫిక్, రోడ్డు భద్రతకు కేటాయించామని చెప్పారు. డ్రగ్ కంట్రోల్‌కు 80 మంది, విజిలెన్స్‌కు 79, సివిల్ సప్లయిస్‌కు 28, డీజీపీ కార్యాలయంలో టీ-స్పార్కు 27, ఏసీబీ, సీఐడీ, సైబర్ సెక్యూరిటీ బ్యూరోలకు 25 మందిని కేటాయించామన్నారు.