పారిస్: హిందూ మత గురువులు ఈఫిల్ టవర్(Eiffel Tower)ను సందర్శించిన సమయంలో అక్కడ పనిచేస్తున్న మహిళా ఉద్యోగినులను విధుల నుంచి తప్పించిన విషయం తెలిసిందే. ఆ చర్యను ఖండిస్తూ సెప్టెంబర్ ఏడో తేదీన ఈఫిల్ టవర్ను మూసివేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఈఫిల్ టవర్ సెక్యూర్టీ కంపెనీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈఫిల్ టవర్ నిర్వహణ కంపెనీకి చీఫ్గా చేస్తున్న పాట్రిక్ బ్రాంకో రువియో తన పదవి నుంచి వైదొలగనున్నట్లు తెలిసింది. ఈ ఏడాది చివరలో ఆయన తన పోస్టును వీడనున్నారు.
సెప్టెంబర్ 5వ తేదీన జరిగిన ఘటనలో నిర్వహణ లోపాలు ఉన్నట్లు దర్యాప్తు ద్వారా తేల్చారు. ఆ వైఫల్యాల వల్ల మహిళా సిబ్బంది ధర్నాకు దిగినట్లు కంపెనీ తన ప్రకటనలో చెప్పింది. ఈఫిల్ టవర్ చీఫ్గా 2018లో పాట్రిక్ తన బాధ్యతలను స్వీకరించారు. ప్రతి ఏడాది ఈఫిల్ టవర్ను సుమారు 70 లక్షల మంది పర్యాటకులు సందర్శిస్తుంటారు. తాజా ఘటన నేపథ్యంలో ఓ కార్మిక నేత స్పందిస్తూ మేనేజ్మెంట్ ఆంక్షలు ఆమోదయోగ్యంగా లేవని తెలిపారు.
బోచసన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తమ్ స్వామినారాయణ్ సంస్థ గ్రూపు సభ్యులు ఈఫిల్ టవర్ను సందర్శించారు. ఆ సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న మహిళా సిబ్బందిని తప్పించారు. ఆ ఘటనపై వివాదం మొదలైంది.