Murder | భోపాల్: భోపాల్ (Bhopal)లోని సూరజ్నగర్లో నివసిస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాకేశ్ అగర్వాల్ (70) భార్యతో కలిసి నివసిస్తున్నారు. మంగళవారం రాత్రి భార్య వేరొక గదిలో పడుకున్నారు. ఉదయం రాకేశ్ గదిలోకి వచ్చి చూడగా హత్యకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. రెండు రోజుల నుంచి కనిపించకుండా పోయిన పనిమనిషిపై పోలీసులు అనుమానిస్తున్నారు.
అతడి గొంతు కోసి హత్య చేసినట్లు రతిబాద్ పోలీసులు వెల్లడించారు. మృతదేహం లభ్యమైన ప్రాంతాన్ని సీనియర్ పోలీస్ అధికారి పరిశీలించి, సాక్ష్యాల సేకరణ కోసం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (FSL) నిపుణులను పిలిపించారు. సంఘటన స్థలంలో లభించిన వస్తువులను, హత్యకు గల కారణాలను పరిశీలిస్తున్నారు.
హత్యకు సంబంధించి కనిపించకుండా వెళ్లిన పనిమనిషే ప్రధాన కారణమని అనుమానిస్తున్నారు. సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. పని మనిషి ఆచూకీ కోసం పోలీసులు బృందాలు రంగంలోకి దిగాయి. రాకేశ్ బంధువులు, చుట్టుపక్కల ఇళ్లలోని వారిని, పరిచయం ఉన్న వారిని ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం ఆస్పత్రికి తరలించామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని అడిషనల్ పోలీస్ కమిషనర్ (Additional Police Commissioner) శైలేంద్ర సింగ్ చౌహాన్ వెల్లడించారు.