Droupadi Murmu : భారతదేశానికి చెందిన వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) యాక్సియం-4 (Axiom-4) మిషన్‌లో భాగంగా బుధవారం రోదసిలోకి వెళ్లారు. దాంతో దాదాపు 41 ఏళ్ల తర్వాత అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి భారత వ్యోమగామిగా ఆయన చరిత్రలో సృష్టించారు. ఈ మిషన్‌కు శుక్లా గ్రూప్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రయోగం సక్సెస్‌పై తాజాగా రాష్ట్రపతి (President of India) ద్రౌపది ముర్ము (Droupadi Murmu) స్పందించారు.
ఫాల్కన్ 9 రాకెట్లో భారత్ నుంచి గ్రూప్ కెప్టెన్‌గా వెళ్లిన శుభాంశు శుక్లా భారత అంతరిక్ష చరిత్రలో కొత్త మైలురాయిని నెలకొల్పారని రాష్ట్రపతి అన్నారు. వారి ప్రయాణంపై దేశం మొత్తం సంతోషంగా, గర్వంగా ఉందని వ్యాఖ్యానించారు. ‘మీరు, యాక్సియం-4 మిషన్‌లోని ఇతర దేశాల వ్యోమగాములు కలిసి ప్రపంచం అంతా ఒకే కుటుంబమని నిరూపించారు.’ అని రాష్ట్రపతి ప్రశంసించారు.
నాసా, ఇస్రో మధ్య శాశ్వత భాగస్వామ్యాన్ని ప్రతిబింబించే ఈ మిషన్ విజయవంతం కావాలని తాను ఆకాంక్షిస్తున్నానని రాష్ట్రపతి ముర్ము చెప్పారు. అక్కడ వ్యోమగాములు చేసే విస్తృత ప్రయోగాలు, శాస్త్రీయ అధ్యయనాలు, అంతరిక్ష యాత్రలకు ముందడుగుగా మారనున్నాయని రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. ఫ్లోరిడాలోని నాసాకు చెందిన కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి బుధవారం మధ్యాహ్నం 12:01 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ప్రయోగం విజయవంతమైంది.
ఫాల్కన్ 9 రాకెట్ సక్సెస్‌ఫుల్‌గా అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత కొన్ని నిమిషాలకు వారు ప్రయాణిస్తున్న వ్యోమనౌక రాకెట్ నుంచి విడిపోయి భూకక్ష్యలోకి ప్రవేశించింది. 28 గంటల ప్రయాణం తర్వాత అంటే గురువారం సాయంత్రం 4.30 గంటలకు వ్యోమనౌక ఐఎస్ఎస్తో అనుసంధానం కానుంది. ఐఎస్ఎస్లో శుభాంశు బృందం 14 రోజులపాటు ఉంటుంది. భారరహిత స్థితిలో పలు ప్రయోగాలు నిర్వహించడంతోపాటు ప్రధాని మోదీ, పాఠశాల విద్యార్థులు, ఇతరులతో వ్యోమగాములు అక్కడి నుంచి మాట్లాడనున్నారు.