కాలిఫోర్నియా: మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తున్న పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్స్(Britney Spears)ను పోలీసులు అరెస్టు చేశారు. కాలిఫోర్నియా హైవే పెట్రోలింగ్ పోలీసులు ఈ విషయాన్ని వెల్లడించారు. బుధవారం రాత్రి 9.30 నిమిషాల ప్రాంతంలో సీహెచ్పీ ఆఫీసర్లు బ్రిట్నీ స్పియర్స్ నడుపుతున్న వాహనాన్ని అడ్డుకున్నారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆమెపై కేసు బుక్ చేశారు. ఆ తర్వాత బ్రిట్నీ స్పియర్స్ను రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. మద్యం మత్తులో వాహనం నడుపున్న అనుమానంపై బ్రిట్నీ స్పియర్స్ను అరెస్టు చేసినట్లు కాలిఫోర్నియా హైవే పెట్రోలింగ్ సమాచార అధికారి రియాన్ అయ్యర్స్ తెలిపారు. చాలా వేగంగా ఓ నలుపు రంగు బీఎండబ్ల్యూ కారు రోడ్డుపై సుడులు తిరుగుతూ వెళ్తున్నట్లు గమనించామని పోలీసులు చెప్పారు. వెంచురా కౌంటీలోని వెస్ట్లేక్ బౌల్యార్డ్ వద్ద కారును ఆపినట్లు పేర్కొన్నారు. ఆ సమయంలో కారులో కేవలం బ్రిట్నీ స్పియర్స్ మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. ఆమెకు డ్రంకింగ్ పరీక్షలు చేపట్టి అదుపులోకి తీసుకున్నారు.