High Court : రాష్ట్రంలో మూడు నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు (Panchayati Elections) నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని (State Election Commission) తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఆదేశించింది. అదేవిధంగా ఎన్నికల సంఘానికి ఎన్నికల నిర్వహణకు కావాల్సిన అన్ని రకాల సహకారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు జస్టిస్ టీ మాధవీ దేవి (Justice T Madhvi Devi) తీర్పును వెలువరించారు.
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణలో తీవ్ర జాప్యం జరుగుతోందని, ఇప్పటికైనా నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పలువురు రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై గత సోమవారం విచారణ జరిపిన హైకోర్టు తీర్పును బుధవారానికి రిజర్వ్ చేసింది. ఇవాళ తీర్పు వెలువరిస్తూ మూడు నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది.
సోమవారం విచారణ సందర్భంగా హైకోర్టు.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఉదాసీన వైఖరిపై సీరియస్గా స్పందించింది. పంచాయతీల గడువు 2024 జనవరి 31 నాటికే ముగిసినా ఇప్పటివరకు ఎందుకు ఎన్నికలు నిర్వహించడంలేదని ప్రశ్నించింది. కాగా, పంచాయతీ ఎన్నికల నిర్వహణలో జాప్యం రాజ్యాంగంలోని ఆర్టికల్ 243E, ఆర్టికల్ 243K లకు విరుద్ధమని పిటిషనర్లు తమ పిటిషన్లలో పేర్కొన్నారు.
అయితే రాష్ట్రంలో కులగణన సర్వే జరుగుతున్నందున ఎన్నికల నిర్వహణకు తమకు మరికొంత సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోర్టును కోరింది. అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల నిర్వహణకు తమకు అదనంగా మరో 60 రోజుల సమయం ఇవ్వాలని కోర్టుకు విన్నవించింది. అయితే పంచాయతీ ఎన్నికల గడువు ముగిసిన ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా నిర్వహించకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని జస్టిస్ మాధవీ దేవి నిలదేశారు.