బయ్యారం : నిషేధిత వస్తువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బయ్యారం ఎస్ఐ తిరుపతి అన్నారు. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రాంనాథ్ ఆదేశాల మేరకు బుధవారం తెల్లవారుజామున బయ్యారం మండలంలోని రామచంద్రాపురం గ్రామంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ఎస్ఐ తిరుపతి సిబ్బందితో నిర్వహించారు. ఇందులో రూ.7000 విలువ గల IMFL లిక్కరు, రూ.5000 విలువ గల గుట్కా పాకెట్స్, 10 లీటర్లు గుడుంబా,500 లీటర్లు బెల్లం పానకం పట్టుకొని నలుగురి పైన కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
సరైన పత్రాలు లేని 20 వాహనాలను సీజ్ చేశారు. అనంతరం ట్రాఫిక్ రూల్స్, సైబర్ క్రైమ్స్, గురించి గ్రామస్థులకు అవగాహన కల్పించి ప్రభుత్వ నిషేధిత గుడుంబా, గంజాయి, గుట్కా , నల్ల బెల్లం వంటివి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ లకు దూరంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట ఆర్ఎస్ఐ పుల్లారావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.