Prashant Kishor | రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ (Jan Suraaj Party) వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor) ఆరోగ్యం క్షీణించింది. ప్రస్తుతం ఆయన డీహైడ్రేషన్ (dehydration), త్రోట్ ఇన్ఫెక్షన్ (throat infection)తో బాధపడుతున్నట్లు తెలిసింది. ఇటీవలే నిర్వహించిన బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (Bihar Public Service Commission) పరీక్ష రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పాట్నాలో ప్రశాంత్ కిశోర్ నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల పాటు నిరాహార దీక్ష చేయడంతో ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన్ని పట్నాలోని ఆసుపత్రికి తరలించామని.. అక్కడి వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నాయి.
కాగా, ఇటీవలే జరిగిన బీహార్ పబ్లిక్ సర్వీసెస్ పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరీక్షను రద్దు చేయాలన్న డిమాండ్‌తో విద్యార్థులకు సంఘీభావంగా పట్నాలోని గాంధీ మైదాన్‌లో గాంధీ విగ్రహం వద్ద ఈ నెల 2న ఆమరణ దీక్షకు కూర్చున్నారు. ఆయన దీక్షను పోలీసులు సోమవారం భగ్నం చేశారు. సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఎయిమ్స్ దవాఖానకు తరలించారు. అనంతరం కోర్టు ముందు హాజరుపరిచారు.
ఇలాంటి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడొద్దని హెచ్చరిస్తూ న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. అయితే, దాన్ని ప్రశాంత్ కిశోర్ తిరస్కరించడంతో.. పోలీసులు బ్యూరో సెంట్రల్ జైలుకు తరలించారు. అనంతరం కోర్టు షరతులు లేని బెయిల్ మంజూరు చేయడంతో సోమవారం రాత్రి జైలు నుంచి విడుదలయ్యారు.
Also Read..
“Prashant Kishor | ప్రశాంత్ కిశోర్ ఆమరణ దీక్ష భగ్నం.. బలవంతంగా ఎయిమ్స్‌కు తరలింపు”
“Prashant Kishor | నిరాహార దీక్షలో ప్రశాంత్ కిషోర్.. కోట్ల ఖరీదైన ఆయన లగ్జరీ వ్యాన్ ఫొటో వైరల్”