With Love OTT | ఇటీవల థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న క్యూట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘విత్ లవ్’ (With Love) ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్లోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు చిత్ర యూనిట్ శుభవార్త అందించింది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ (Netflix) ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకోగా.. ఈ చిత్రం మార్చి 6 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు, హిందీ, మలయాళం మరియు కన్నడ భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులోకి రానుండటం విశేషం.
ఈ సినిమా విశేషాల్లోకి వెళ్తే, ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ చిత్రంతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అభిషన్ జీవింత్ ఈ సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యారు. ఆయన సరసన మలయాళ ముద్దుగుమ్మ అనస్వర రాజన్ కథానాయికగా నటించి మెప్పించింది. మదన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఒక ఆసక్తికరమైన కథా నేపథ్యంతో సాగుతుంది. బ్లైండ్ డేట్లో కలిసిన ఇద్దరు వ్యక్తులు (సత్య మరియు మనీషా), తాము ఒకే స్కూల్లో చదువుకున్నామని తెలుసుకోవడం, అక్కడి నుంచి తమ పాత జ్ఞాపకాలను మరియు స్కూల్ డేస్ క్రష్లను నెమరువేసుకుంటూ సాగే ప్రయాణం ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇచ్చింది. కేవలం 7 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించి ‘బ్లాక్బస్టర్’గా నిలిచింది.