US vs Iran : అమెరికా-ఇజ్రాయెల్ (US-Israel) దేశాలకు, ఇరాన్ (Iran) కు మధ్య యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. ఖమేనీ (Khamenei) మృతికి ప్రతీకారంగా ఇరాన్ తన దాడులను తీవ్రతరం చేసింది. తాజాగా సౌదీ అరేబియా రాజధాని రియాద్ (Riyadh) లోని అమెరికా ఎంబసీ (US Embassy) పై ఇరాన్ సైన్యం విరుచుకుపడింది. డ్రోన్లతో దాడి చేయగా.. పెద్ద ఎత్తున మంటలు చెలరేగి దట్టమైన పొగ అలముకుంది.
రెండు డ్రోన్‌తో యూఎస్ ఎంబసీపై దాడి జరిగిందని సౌదీ రక్షణ శాఖ తెలిపింది. దాడి జరగగానే మంటలు వ్యాపించినట్లు వెల్లడించింది. దాంతో భవనానికి స్వల్పంగా నష్టం వాటిల్లినట్లు తెలిపింది. దాడి సమయంలో కార్యాలయం ఖాళీగా ఉందని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. తాజా దాడి నేపథ్యంలో జెడ్డా, దహ్రాన్, రియాద్‌లోని అమెరికన్లు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సౌదీ అరేబియాలోని యూఎస్ రాయబార కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
ఆ తర్వాత కొంతసేపటికే రియాద్‌లో మరోసారి పేలుళ్లు వినిపించాయి. ఇక సోమవారం కూడా కువైట్‌లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ దాడికి పాల్పడింది. తాజా దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పేరు ప్రస్తావించకుండా హెచ్చరికలు చేశారు. రియాద్‌లోని తమ ఎంబసీపై జరిగిన దాడికి, అమెరికన్ సైనికుల హత్యకు ప్రతిస్పందన ఎలా ఉంటుందో వాళ్లు త్వరలోనే తెలుసుకుంటారని వ్యాఖ్యానించారు.