సిద్దిపేట : గిరిజన యువత వ్యాపార రంగంలో ఎదగడానికి ఆత్మవిశ్వాసం, పట్టుదల, క్రమశిక్షణ చాలా ముఖ్యం. కష్టపడితే ఎవరైనా విజయాలు సాధించవచ్చు అని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేటలో ట్రైబల్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (TICCI) ఆధ్వర్యంలో జరిగిన గిరిజన పారిశ్రామికవేత్తల అవగాహన సదస్సు, సిద్దిపేట చాప్టర్ ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నిజామాబాద్ జిల్లా గవర్నమెంట్ స్కూల్ లో చదివిన రమేష్ నాయక్ అనే గిరిజన బిడ్డ లండన్ లో 16 హోటళ్లు స్థాపించి గొప్ప వ్యాపారవేత్తగా ఎదిగాడు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో టీ ప్రైడ్ ద్వారా సహకారం అందుకున్న సురేష్ నాయక్ అనే మరో గిరిజన బిడ్డ హైదరాబాద్లో హార్లిక్స్ బర్త్ డే కేకులు తయారుచేస్తూ పెద్ద కంపెనీలతో పోటీపడుతున్నాడు. ఇలాంటి స్ఫూర్తిదాయక కథల నుంచి యువత నేర్చుకోవాలన్నారు. ఒకప్పుడు కేసీఆర్ నాయకత్వంలో గిరిజన అభివృద్ధి కోసం వందల కోట్ల సబ్సిడీలు ఇస్తూ యువతను పారిశ్రామికవేత్తలుగా తయారు చేశాం. దేశంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారి గిరిజన మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.
రిజర్వేషన్లను పెంచాం..
తెలంగాణ ఏర్పడ్డాక గిరిజనులకు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచాం. దీనివల్ల ఎంతో మంది గిరిజన బిడ్డలు నేడు డాక్టర్లు, ఇంజినీర్లు అయ్యారు. రాష్ట్రంలోని 3,300 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి, గిరిజన బిడ్డలను సర్పంచులుగా చేసి వాళ్లకు రాజ్యాధికారాన్ని అందించాం. జనాభా ప్రాతిపదికన కేటాయించిన నిధులు ఆ సంవత్సరం ఖర్చు కాకపోతే, అవి ల్యాప్స్ కాకుండా మరుసటి ఏడాడికి క్యారీ ఫార్వర్డ్ అయ్యేలా ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని తెచ్చి పక్కాగా అమలు చేశామన్నారు.
6 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇచ్చి గిరిజనులను రైతులుగా మార్చాం. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు తీవ్ర ద్రోహం చేస్తోంది. మేనిఫెస్టోలో ఎన్నో చెప్పారు. పదో తరగతి పాస్ అయితే రూ.10 వేలు, పీజీ చేస్తే రూ.2 లక్షలు అన్నారు.. కానీ ఏ ఒక్కటి అమలు కాలేదని మండిపడ్డారు. మొన్న అసెంబ్లీలో మేం ప్రశ్నిస్తే.. ఎస్టీ కార్పొరేషన్ కు రూ.2,730 కోట్లు కేటాయించామని ప్రభుత్వం చెప్పింది. కానీ ఖర్చు పెట్టింది కేవలం రూ.70 కోట్లు మాత్రమే. ఆ డబ్బులు కరెంట్ బిల్లులకు, ఫ్యాన్లకు, కార్లకు సరిపోయాయి. ఒక్క గిరిజన బిడ్డకు కూడా ఉపాధి కల్పించలేదన్నారు.
జైల్లో పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు..
ఎస్సీ, ఎస్టీ భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి.. ఇవాళ లక్ష ఎకరాల అసైన్డ్ భూములను గుంజుకుని పేదలను రోడ్డున పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లగచర్లలో భూములు ఇవ్వబోమని అడిగిన పాపానికి లంబాడీ బిడ్డలను జైల్లో పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు. యువతకు జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. కానీ ఎక్కడా ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేవు.
యువతకు అన్యాయం జరుగుతున్న ఈ పరిస్థితుల్లో టిక్కీ (TICCI) లాంటి సంస్థలు కేవలం సహకారం అందించడమే కాకుండా, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ఒక ప్రెజర్ గ్రూప్ గా కూడా పనిచేయాలని సూచించారు. పెండింగ్లో ఉన్న సబ్సిడీలను రాబట్టడానికి కృషి చేయాలి. సిద్దిపేట జిల్లాలోని ఎస్టీ యువతీ యువకులు టిక్కీ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.