Arvind Kejriwal | ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టై జైలుకు వెళ్లినా సీఎం పదవికి రాజీనామా చేయకపోవడానికి గల కారణాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తాజాగా వెల్లడించారు.
ఈ మేరకు శనివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో కేజ్రీ మాట్లాడుతూ.. సీఎం కుర్చీ నుంచి తనను తప్పించేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఆరోపించారు. ఈ కుట్రలో భాగంగా తప్పుడు కేసు పెట్టి తనను జైలుకు పంపారన్నారు. అందుకే ఎట్టిపరిస్థితుల్లోనూ సీఎం పదవిని వదులుకోలేదని వివరించారు. ‘నాకు ముఖ్యమంత్రి పదవి ముఖ్యంకాదు. నన్ను సీఎం పదవి నుంచి దింపేందుకు బీజేపీ కుట్ర పన్నింది. ఇందులో భాగంగానే తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపింది. అది గుర్తించే నేను ముఖ్యమంత్రి పదవిని వదులుకోలేదు. ప్రధాని నరేంద్ర మోదీ నిజంగానే అవినీతిపై పోరాడాలనుకుంటే నన్ను చూసి నేర్చుకోవాలి. మా మంత్రులతో సహా అవినీతి నాయకులను మేం జైలుకు పంపించాం’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
కాగా, ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌కు మార్చి 21వ తేదీన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కుంభకోణం వెనుక కీలక నిందితుడు ఆయనేనని, మద్యం వ్యాపారుల నుంచి కిక్‌బ్యాక్‌లు డిమాండ్ చేయడంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారని ఈడీ ఆరోపించింది. ఇక అరెస్ట్ అయినప్పటి నుంచి ఆయన తీహార్ జైల్లోనే ఉన్నారు. ఇక అప్పటి నుంచి కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయాలంటూ బీజేపీ నేతలు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. దీనిపై తాజాగా స్పందించిన కేజ్రీ.. తాను సీఎం పదవికి ఎందుకు రాజీనామా చేయలేదో తాజాగా స్పష్టం చేశారు.
మరోవైపు కేజ్రీ అరెస్టైన 50 రోజుల తర్వాత శుక్రవారం సాయంత్రం మధ్యంతర బెయిల్ (Interim Bail)పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో పాల్గొనేందుకు వీలుగా మధ్యంతర బెయిల్ కోసం అభ్యర్థిస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం శుక్రవారం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 1 వరకూ బెయిల్ ఇస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read..
Iran | ఉద్రిక్త పరిస్థితుల వేళ.. ఇజ్రాయెల్‌కు అణుబాంబు హెచ్చరికలు చేసిన ఇరాన్
Ink Mark | తొమ్మిదేళ్లయినా చెరగని సిరా గుర్తు.. కేరళ మహిళకు తలనొప్పిగా మారిన ఇంక్ మార్క్
Telugu Students | అమెరికాలో విషాదం.. జలపాతంలో మునిగి ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి