Lok Sabha : లోక్‌సభ (Lok Sabha) లో సోమవారం (జూలై 28) నుంచి ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) పై చర్చ జరగనుంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తాజాగా వెల్లడించాయి. లోక్‌సభలో ఆపరేషన్ సింధూర్‌పై చర్చ కోసం కేంద్రం ఏకంగా 16 గంటల సమయం కేటాయించింది. ప్రధాన మంత్రి (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) సమక్షంలో ఈ చర్చ జరగనుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) చర్చను ప్రారంభించనున్నారు.
రాజ్యసభలో కూడా ఆపరేషన్ సింధూర్‌పై చర్చ జరగనుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాజ్యసభలో జూలై 29 నుంచి 9 గంటలపాటు దీనిపై చర్చ జరుపనున్నట్లు వెల్లడించింది. రెండు సభల్లోనూ చర్చకు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమాధానం ఇస్తారు. కాగా ఆపరేషన్ సింధూర్‌పై చర్చకు విపక్షాలు ఎప్పటి నుంచో పట్టుపడుతున్నాయి. భారత్, పాక్ మధ్య తానే కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే కామెంట్స్ చేస్తుండటంపై కేంద్ర జవాబుచెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో రేపు లోక్‌సభ సమావేశాలు వాడీవేడిగా జరిగే అవకాశం ఉంది. కాగా ఏప్రిల్ 22న ఉగ్రవాదులు జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్లో టూరిస్టులపై కాల్పులు జరిపి 26 మందిని దారుణంగా చంపేశారు. దాంతో ఈ దాడికి ప్రతీకారంగా భారత్.. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది.