పాట్నా: బీజేపీ పాలిత బీహార్‌లోని గయ జిల్లాలో హోం గార్డు నియామక పరీక్షల్లో పాల్గొన్న అభ్యర్థిని (26)పై గ్యాంగ్ రేప్ జరిగినట్లు కేసు నమోదైంది. ఈ నెల 24న బోధ్ గయలోని బీహార్ మిలిటరీ పోలీస్ మైదానంలో ఈ పరీక్షలు జరిగాయి. దీనిలో భాగంగా శారీరక దారుఢ్య పరీక్షల సమయంలో బాధితురాలు స్పృహ కోల్పోయారు. వెంటనే ఆమెను దవాఖానకు తరలించేందుకు అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారు.
ప్రయాణ సమయంలో తనకు పాక్షికంగా స్పృహ ఉందని, అంబులెన్స్‌లో తనపై ముగ్గురు లేదా నలుగురు అత్యాచారం చేసినట్లు అర్థమైందని బాధితురాలు తన ఫిర్యాదులో ఆరోపించారు. తర్వాత కొద్ది గంటల్లోనే అంబులెన్స్ డ్రైవర్, టెక్నీషియన్లను ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్ట్ చేసింది.
బీహార్ అధికార కూటమిలోని లోక్ జనశక్తి (రామ్ విలాస్) పార్టీ చీఫ్, ఎంపీ చిరాగ్ పాశ్వాన్ ఈ ఘటనపై స్పందిస్తూ, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దిగజారిపోతుండటం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నేరాలు విపరీతంగా జరుగుతున్నాయని, అటువంటి ప్రభుత్వానికి మద్దతిస్తుండటం విచారంగా ఉందని చెప్పారు.