Haridwar Stampede | హరిద్వార్‌లోని మానసాదేవి ఆలయంలో ఆదివారం ఉదయం తొక్కిసలాట జరిగింది. ఈ విషాదకర ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందారు. మరో 25 మంది భక్తులు గాయపడ్డారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని హరిద్వార్ ఎస్ఎస్పీ తెలిపారు. మానసాదేవి ఆలయంలో భారీగా భక్తులు తరలివచ్చారు. ఈ సమయంలో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తున్నది. ఘటనకు కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న గర్హ్వాల్ డివిజన్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే సంఘటనా స్థలానికి బయలుదేరారు. ప్రస్తుతం ఆలయం వద్ద అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
అయితే, మానసాదేవి ఆలయానికి వెళ్లే రెండు కిలోమీటర్ల నడక మార్గంలో తొక్కిసలాట జరిగినట్లు సమాచారం. పెద్ద సంఖ్యలో గుమిగూడిన నేపథ్యంలో రద్దీ కారణంగా తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తున్నది. కొందరు వెనక్కి వెళ్లేందుకు ప్రయత్నించగా.. మరికొందరు ముందుకు చొచ్చుకురావడంతోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తున్నది. ఈ ఘటన నేపథ్యంలో చాలామంది ఊపిరాడక పడిపోయగా.. వారందరినీ అంబులెన్స్ ద్వారా సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. అధికారులు ప్రస్తుతం పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
తొక్కిసలాట ఘనటపై సీఎం పుష్కర్‌సింగ్ ధామీ స్పందించారు. తొక్కిసలాట ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఎస్డీఆర్ఎఫ్ పోలీసులు, స్థానిక పోలీసులు, ఇతర రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ, సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమైనట్లు తెలిపారు. హరిద్వార్‌లోని మానసా దేవి ఆలయానికి వెళ్లే మార్గంలో తొక్కిసలాట జరిగినట్లు జరగడం బాధాకరమన్నారు. ఈ విషయంపై స్థానిక పరిపాలనను సంప్రదించి పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. భక్తులంతా క్షేమంగా ఉండాలని మాతా మానసాదేవిని ప్రార్థిస్తున్నానన్నారు.