Dhurandhar 2 | భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీక్వెల్స్‌లో ఒకటైన ధురందర్ 2 చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్‌ను తాజాగా ఆయన భార్య, నటి యామి గౌతమ్ ప్రత్యేక స్క్రీనింగ్‌లో వీక్షించారు. సినిమా చూసిన అనంతరం ఆమె సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు చిత్రంపై మరింత ఆసక్తిని రేకెత్తించాయి. ఈ చిత్రం “బియాండ్ ఎక్స్ట్రార్డినరీ” అంటూ యామి ప్రశంసించారు. స్క్రీనింగ్ ముగిసిన వెంటనే ఫ్లైట్ ఎక్కాల్సి వచ్చినా, సినిమాలోని భావోద్వేగాల ప్రభావం నుంచి బయటపడలేక ఆదిత్యతో మాట్లాడలేని స్థితికి చేరుకున్నానని ఆమె పేర్కొన్నారు. ప్రయాణంలో మరో స్క్రిప్ట్ చదవాలని ప్రయత్నించినా, మనసంతా ‘దురంధర్ 2’ సన్నివేశాల చుట్టూనే తిరిగిందని వెల్లడించారు. కేవలం 40 పేజీల స్క్రిప్ట్ వినిపించినప్పుడే తన కళ్లలో నీళ్లు తిరిగాయని, ఇప్పుడు తెరపై చూసాక అది మర్చిపోలేని అనుభవంగా మారిందని యామి వ్యాఖ్యానించారు.
దర్శకుడు ఆదిత్య ధర్ గురించి మాట్లాడుతూ, ఆయనకు ప్రేక్షకులపైనా దేశంపైనా అపారమైన ప్రేమ ఉందని యామి కొనియాడారు. ప్రమాదకర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తూ ఎంతో నిజాయితీతో ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేశారని ప్రశంసించారు. తొలి భాగం ‘దురంధర్’ ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్ల వసూళ్లు సాధించి చరిత్ర సృష్టించడంతో, రెండో భాగంపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సీక్వెల్లో రణ్వీర్ సింగ్ గూఢచారి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అలాగే సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి దిగ్గజ నటుల సమిష్టి నటన సినిమాకు అదనపు బలాన్ని ఇస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. యామి గౌతమ్ కూడా ఈ చిత్రంలో ఓ కీలక అతిథి పాత్రలో కనిపించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
మరోవైపు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఈ చిత్రంపై స్పందిస్తూ, ‘దురంధర్ 2’ ఒక ఆస్టరాయిడ్ స్ట్రైక్లాంటిదని, పాత మసాలా సినిమాల ధోరణిని పూర్తిగా మార్చేస్తుందని వ్యాఖ్యానించారు. ఓవైపు భార్య ప్రశంసలు, మరోవైపు ప్రముఖుల విశ్లేషణలతో సినిమాపై హైప్ భారీగా పెరిగింది. అయితే, భార్య తన భర్త సినిమాను ప్రశంసించడం సహజమేనని, అసలు తీర్పు మాత్రం ప్రేక్షకులదేనని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం మార్చి 19, 2026న విడుదల కానుంది. అదే రోజున కన్నడ స్టార్ యష్ నటిస్తున్న ‘టాక్సిక్’ కూడా విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్ తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పోటీ నేపథ్యంలో 100 కోట్ల ఓపెనింగ్స్ సాధించడం సవాలుగా మారొచ్చని అంచనాలు ఉన్నాయి.