Meghalaya murder : మేఘాలయ (Meghalaya) లోని ఉత్తరఖాసీ కొండల్లో మధ్యప్రదేశ్ (Madhyapradesh) లోని ఇండోర్ (Indore) నగరానికి చెందిన వ్యాపారి రాజారఘువంశీ (Raja Raghuvanshi) హత్యకు గురికావడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అతడి భార్యే హనీమూన్ పేరుతో భర్తను మేఘాలయకు తీసుకొచ్చి చంపించడం చర్చనీయాంశమైంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురిని పోలీసులు షిల్లాంగ్ (Shillang) లోని ఓ పోలీస్‌స్టేషన్‌లో ఇంటరాగేట్ చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో పలు కొత్త విషయాలు బయటికి వస్తున్నాయి.
రాజారఘువంశీ హత్య అనంతరం ఎవరైనా ఒక మహిళను హత్యచేసి, మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టి అది సోనమ్ మృతదేహంగా నమ్మించాలని నిందితులు ప్లాన్ వేశారు. అందుకోసమే సోనమ్ తిరిగి ఇండోర్‌కు రప్పించి, ఓ అద్దె ఇంట్లో దాచిపెట్టారు. సోనమ్‌ను 18 రోజులపాటు దాచి ఉంచినా మరో మహిళ హత్యకు వీలుపడకపోవడంతో.. ఆమెను బాధితురాలిలా పోలీసుల ముందు లొంగిపోవాలని చెప్పి కొత్త నాటకం ఆడారు.
సహ నిందితులు చెప్పినట్టే సోనమ్ బాధితురాలిలా నటించినా పోలీసులు నమ్మలేదు. ఎందుకంటే అప్పటికే.. సోనమ్ తన ప్రియుడు రాజ్కుశ్వాహాతో మాట్లాడిన ఫోన్‌కాల్స్, హత్యకు పన్నిన కుట్ర విషయాలను పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత వేర్వేరు ప్రాంతాల నుంచి నిందితులను అరెస్ట్ చేసిన మేఘాలయ పోలీసులు ట్రాన్సిట్ రిమాండ్‌పై షిల్లాంగ్‌కు తీసుకొచ్చి విచారిస్తున్నారు.