Mohsen Rezaei : ఇజ్రాయెల్-ఇరాన్ (Israel-Iran) దేశాల మధ్య జరుగుతున్న దాడులు, ప్రతిదాడులతో ప్రస్తుతం పశ్చమాసియా ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్ తమపై అణుబాంబును ప్రయోగిస్తే పాకిస్థాన్ (Pakistan) రంగంలోకి దిగి ఇజ్రాయెల్‌పై అణుదాడి చేస్తుందని ఇరాన్ పేర్కొంది. ఈ మేరకు ఇరాన్‌కు చెందిన ఐఆర్జీసీ జనరల్ మొహసిన్ రెజాయి (Mohsen Rezaei) తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇరాన్ ప్రభుత్వం అధీనంలోని ఓ టెలివిజన్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెజాయి మాట్లాడారు. ‘ఇజ్రాయెల్ మాపై అణుదాడి చేస్తే.. పాకిస్థాన్ ఇజ్రాయెల్‌పై అణుబాంబును ప్రయోగిస్తుంది. ఈ మేరకు పాకిస్థాన్ నుంచి మాకు హామీ ఉంది’ అని మొహసిన్ వ్యాఖ్యానించారు. కాగా మొహిసిన్ ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్లో సభ్యుడిగా కూడా ఉన్నారు.
టర్కీ, సౌదీ అరేబియా, పాకిస్థాన్ తదితర దేశాలతో కలిసి ఇస్లామిక్ ఆర్మీని ఏర్పాటు చేయాలని మొహసిన్ ప్రతిపాదించారు. కానీ ఆయా దేశాలు ఇరాన్ యూనిఫామ్ వేసుకోవడానికి సిద్ధంగా లేవని వ్యాఖ్యానించారు. ఒక్క ఇస్లామిక్ దేశమైనా ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపితే రాత్రికి రాత్రే ప్రాంతీయ బలాబలాలు మారిపోతాయన్నారు.
కాగా ప్రపంచంలో ప్రస్తుతం అణ్వాయుధాలున్న దేశాల జాబితాలో ఇజ్రాయెల్, పాకిస్థాన్ దేశాలు స్థానం దక్కించుకొన్నాయి. ఈ జాబితాలో ఇప్పటికే అమెరికా, రష్యా, ఫ్రాన్స్, భారత్, ఉత్తర కొరియా ఉన్నాయి.