TGSRTC | గోదావరిఖని : విధి నిర్వహణలో ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వహించాడు. ఆ బస్సులో తనతో పాటు రావాల్సిన కండక్టర్ వచ్చాడో లేడో కూడా పట్టించుకోకుండానే బస్సును స్టార్ట్ చేసి వెళ్లిపోయాడు. కొద్దిదూరం వెళ్లాక కండక్టర్ ఎక్కలేదనే విషయాన్ని ప్రయాణికులు గమనించి చెప్పడంతో తిరిగి బస్టాండ్‌కు బస్సును తీసుకెళ్లాడు. గోదావరిఖని డిపో పరిధిలో సోమవారం ఈ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. గోదావరిఖని బస్టాండ్ నుంచి కరీంనగర్‌కు వెళ్లే ఎక్స్‌ప్రెస్ TS027 0286 ( గోదావరిఖని డిపో) బస్సు సోమవారం ఉదయం 11 గంటలకు బయల్దేరాల్సి ఉంది. అయితే హడావుడిగా వచ్చిన బస్సు డ్రైవర్ బస్సును స్టార్ట్ చేసి వెళ్లిపోయాడు. కొద్దిదూరం వెళ్లిన తర్వాత టికెట్లు తీసుకోవడానికి ఎవరూ రాకపోవడంతో పలువురు ప్రయాణికులు అనుమానంతో.. మీరే టికెట్ ఇస్తారా? అని బస్సు డ్రైవర్‌ను అడిగారు. దానికి కండక్టర్నే టికెట్లు ఇస్తాడని బదులిచ్చాడు. దానికి మరి బస్సులో కండక్టర్ లేడు కదా అని ప్రయాణికులు ఎదురు ప్రశ్నించడంతో బస్సు డ్రైవర్ షాకయ్యాడు. వెంటనే బస్సును ఆపి.. తిరిగి బస్టాండ్‌కు తీసుకొచ్చాడు.
ఈ ఘటనపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కండక్టర్ ఎక్కాడో లేదో కూడా చూడకుండా విధిలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా అని ప్రశ్నించారు. ఇలాంటి ప్రవర్తనతో బస్సు నడిపి ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని నిలదీశారు. సంబంధిత డ్రైవర్‌పై గోదావరిఖని బస్ డిపో మేనేజర్‌కు ప్రయాణికులు ఫిర్యాదు చేశారు.