Donkey Milk | జహీరాబాద్, జూన్ 16 : గంగి గోవుపాలు గరిటెడైనను చాలు.. కడివడైననేమి కరము పాలు.. ఇది ఒకప్పడు అందరూ చదువుకున్న పద్యపాదం. ఆవు పాల ముందర గాడిద పాలు ఎందుకూ పనికిరావని దీని అర్థం. అయితే పరిస్థితి ఇప్పుడు మారిపోయింది. ఆవుపాల కంటే కూడా గాడిద పాలకే ఎక్కువ డిమాండ్ వచ్చింది. పిల్లల దగ్గు, ఆయాసం తగ్గడానికి వీటిని వినియోగిస్తుండడంతో లీటరు పాలు రూ.2 నుంచి 5 వేల వరకు పలుకుతున్నాయి. పది మి.లీ. పిల్లలకు తాగిస్తే దగ్గు, ఆయాసం, ఆకలి లేకపోవడం వంటి వ్యాధులు నయమవుతాయని గ్రామీణుల నమ్మకం. దీంతో 10 ఎంఎల్ పాలు రూ.100 నుంచి రూ.120 పలుకుతున్నాయి.
కర్ణాటక, మహారాష్ట్రతో పాటు తెలంగాణకు చెందిన పలువురు గాడిద పాల వ్యాపారులు సోమవారం నాడు సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని పలు గ్రామాల్లో తిరుగుతూ వ్యాపారం చేస్తూ కనిపించారు. చిన్న పిల్లలు ఉన్న ఇళ్ల దగ్గరకు వెళ్లి వాటిని విక్రయిస్తున్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌కు చెందిన గాడిద పాల వ్యాపారి గంగా మాట్లాడుతూ.. ఊరూరు తిరుగుతూ గాడిద పాలు అమ్ముతున్నానని చెప్పారు. ఆ విధంగా గోనెగండ్లకు వచ్చినట్టు తెలిపాడు. తనతోపాటు కర్ణాటక, తెలంగాణలకు చెందిన మరికొంతమంది మండలంలోని పలు పల్లెల్లో పాలు విక్రయిస్తున్నట్టు వెల్లడించాడు. ఈ పాలు చిన్నపిల్లలకు ఎంతో ఆరోగ్యాన్నిస్తాయని, ఒక్క గాడిద రోజుకు 200 ఎంఎల్ నుంచి 250 ఎంఎల్ పాలు ఇస్తుందని తెలిపాడు.