రోగనిరోధకశక్తిని పెంచుకోవటం అనగానే ఆరోగ్యకర ఆహారం, వ్యాయామం, పోషక మాత్రలు, విటమిన్లు, సూపర్ ఫుడ్స్ వంటివే గుర్తుకొస్తుంటాయి. కానీ కంటి నిండా నిద్ర పోవటమూ ముఖ్యమే. నిద్ర, రోగనిరోధక వ్యవస్థ రెండూ ఒకదాంతో మరోటి ముడిపడి ఉంటాయి. నిద్ర పోతున్నప్పుడు రోగనిరోధక శక్తికి దన్నుగా నిలిచే రకరకాల కీలక ప్రక్రియలు కొనసాగుతాయి.
సైటోకైన్ల ఉత్పత్తి: సైటోకైన్లనే ప్రొటీన్లు వార్తాహరులుగా పనిచేస్తూ.. రోగనిరోధక ప్రతిస్పందనను నియంత్రిస్తుంటాయి. ఇంటర్ల్యూకీన్ 1 (ఐఎల్-1), ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ (టీఎన్ఎఫ్) వంటి కొన్ని సైటోకైన్ల సంఖ్య నిద్రపోతున్నప్పుడు పెరుగుతుంది. ఇవి వాపు ప్రక్రియ, ఇన్ఫెక్షన్లతో పోరాడటంలో సాయం చేస్తాయి. నిద్రలేమితో వీటి ఉత్పత్తి పడిపోతుంది. రోగనిరోధక రక్షణ వ్యవస్థ బలహీనపడుతుంది.
టి-కణాల చురుకుదనం: తెల్ల రక్తకణాల్లో ఒకటైన టి-కణాలు ఇన్ఫెక్షన్లతో పోరాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి చురుకుగా పనిచేయటానికి.. ఇన్ఫెక్షన్కు గురైన కణాలను గుర్తించి, వాటిని నిర్మూలించే సామర్థ్యం ఇనుమడించటానికి నిద్ర తోడ్పడుతోందని పరిశోధనలు చెబుతున్నాయి.
యాంటి బాడీస్ ఉత్పత్తి: రోగకారక క్రిములను గుర్తించి, వాటిని నిర్వీర్యం చేసేవి యాంటి బాడీలే. ఇవి బాగా ఉత్పత్తి కావటానికి నిద్ర సాయం చేస్తుంది. రకరకాల జబ్బులను ఎదుర్కొనేలా శరీరం సన్నద్ధం కావటానికి దోహదం చేస్తుంది.
కాబట్టి రోగనిరోధక శక్తిని పెంపొందించుకొని, జబ్బుల బారినపడకుండా ఉండాలంటే కంటి నిండా నిద్రపోవటానికి ప్రయత్నించండి. అర్ధరాత్రి వరకూ టీవీలు, మొబైల్ ఫోన్లు చూడటం మానేసి, త్వరగా నిద్రకు ఉపక్రమించండి. పెద్దవారిలో చాలామందికి రాత్రిపూట 7-9 గంటలు నిద్ర అవసరం. అలాగని అతిగానూ పడుకోవద్దు. 9-10 గంటల కన్నా ఎక్కువసేపు నిద్రిస్తున్నారంటే గాఢ నిద్ర కరువైందని, నిద్రపట్టక సతమతమవుతున్నారనే అర్థం.