హైదరాబాద్ : పార్టీ పిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి స్పీకర్ ( Speaker ) క్లీన్ చీట్ ఇవ్వడం చూస్తే స్పీకర్ రాజ్యాంగాన్ని ఖననం చేసినట్లుగా ఉందని రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి డా. కేతిరెడ్డి వాసుదేవరెడ్డి ( Kethireddy Vasudeva Reddy) ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను కాంగ్రెస్ చెరపట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు.
నవ్వి పోదురు గాక నాకెంటి సిగ్గు అన్నట్టు పాలన కొనసాగుతుందని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉందని, స్పీకర్ నిర్ణయంతో ప్రజాస్వామ్య వ్యవస్థ కూడా సంక్షోభంలో పడిందని ఎద్దేవా చేశారు .బీఆర్ఎస్ పార్టీ బీ-ఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యే, తరువాత కాంగ్రెస్ పార్టీ బీ-ఫామ్ మీద ఎంపీగా పోటీ చేసినప్పటికీ అనర్హత వేటు వేయకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థపై మాయని మచ్చగా నిలిచిందని ఆరోపించారు.
మరోవైపు, కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి తరపున ప్రచారం చేసినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం పూర్తిగా అన్యాయమని అన్నారు.కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక విధానాలకు ప్రజలు విసిగిపోయారని, ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే చర్యలపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ముందు నిజం వెలుగులోకి వచ్చి, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదనే నమ్మకం ప్రజల్లో ఉందని అభిప్రాయపడ్డారు.