Meghalaya murder : హనీమూన్ (Honeymoon) హత్య కేసు (Murder case) లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులోకి కొత్తగా సంజయ్ వర్మ (Sanjay Verma) అనే వ్యక్తి పేరు వచ్చి చేరింది. సోనమ్ (Sonam) తో సంజయ్ వర్మ 119 ఫోన్ కాల్స్ మాట్లాడినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మార్చి 1 నుంచి 25 తేదీల మధ్య సోనమ్, సంజయ్ వర్మ ఈ కాల్స్ మాట్లాడుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
అయితే ప్రస్తుతం సంజయ్ వర్మ ఫోన్ స్విచాఫ్ చేసి ఉంది. ఈ క్రమంలో రాజా రఘువంశీ హత్య కేసులో సంజయ్ వర్మ ప్రమేయం ఏమైనా ఉందా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అతడి గురించి వివరాలు తెలుసుకోవడానికి నిందితులను విచారిస్తున్నామని చెప్పారు. కాగా ఈ కేసులో సోనమ్ తల్లిదండ్రులు, కుటుంబసభ్యులకు నార్కో టెస్టు చేయాలని ఇటీవల మృతుడి సోదరుడు పోలీసులను కోరాడు.
తన సోదరుడిని హత్య చేసింది కిరాయి గూండాలని ముందుగా అనుకున్నప్పటికీ.. దర్యాప్తులో మాత్రం వారు సోనమ్ ప్రియుడి స్నేహితులని తేలిందని మృతుడు రాజా రఘువంశీ సోదరుడు చెప్పారు. ఈ హత్యలో మరింతమంది ప్రమేయం ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. కేసులో మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే సోనమ్ తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులకు నార్కో టెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.