Biren Singh | ఈశాన్య రాష్ట్రం మణిపూర్ రావణకాష్టంలా రగులుతున్న విషయం తెలిసిందే. రెండు జాతుల మధ్య వైరంతో ఏడాదిన్నరగా అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరిగిన దురదృష్టకర పరిణామాలపై ముఖ్యమంత్రి (Manipur Chief Minister) బీరెన్ సింగ్ (Biren Singh) తాజాగా స్పందించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పారు. 2025లో రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశిస్తున్నట్లు చెప్పారు.
‘ఈ సంవత్సరం మొత్తం చాలా దురదృష్టకరంగా సాగింది. గతేడాది మే 3 నుంచి నేటి వరకు రాష్ట్రంలోని పరిణామాల విషయంలో ప్రజలకు నేను క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది తమ కుటుంబ సభ్యులను కోల్పోయారు. ఇళ్లను కోల్పోయారు. అందుకు నేను చింతిస్తున్నాను. క్షమాపణలు కోరుతున్నాను. అయితే గత నాలుగు నెలలుగా శాంతి భద్రతల పురోగతిని చూసిన తర్వాత 2025 నాటికి రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని నేను భావిస్తున్నాను’ అని ముఖ్యమంత్రి అన్నారు. ఇప్పటి వరకూ జరిగిన తప్పులను క్షమించి.. మణిపూర్‌లోని 35 తెగలు కలిసి సామరస్యంగా జీవించాలని విజ్ఞప్తి చేశారు.
ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో గత మే నెలలో చెలరేగిన ఘర్షణలు యావత్ దేశాన్ని కలవరపరిచాయి. మైతీలకు రిజర్వేషన్ల అంశంపై కుకీలు, మైతీల మధ్య చిచ్చు రేగింది. రెండు జాతుల మధ్య వైరం హింసాత్మకంగా మారింది. ఇద్దరు మహిళలను కొందరు వ్యక్తులు నగ్నంగా ఊరేగించిన ఘటన దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. పార్లమెంట్‌ను కూడా ఈ అంశం కుదిపేసింది. ఈ హింసాత్మక ఘటనల్లో 200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 50 వేల మందికిపైగా నివాసాలను కోల్పోయారు.
Also Read..
Manmohan Singh | మన్మోహన్ సింగ్‌కు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ నివాళి
IRCTC website | ఐఆర్సీటీసీ వెబ్సైట్ మళ్లీ డౌన్.. నెలలో ఇది మూడోసారి..!
Viral video | మనిషి ఒంటరిగా కనబడితే చెంపలు వాయించుడే.. ఓ యువకుడి వింత ప్రవర్తన..!